సమన్వయంతో సమస్యలు తీర్చాలి .. సర్వసభ్య సమావేశంలో నేతలు

  • తాగునీటి సమస్యపై ప్రధాన చర్చ
  • సమిష్టి కృషితోనే అభివృద్ధి: జడ్పీ చైర్మన్

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్​ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అలసత్వం వహించొద్దని, వాటిని వెంటనే పరిష్కరించాలని నేతలు కోరారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను తీర్చాలన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నేతలు మాట్లాడారు. ముందుగా మిషన్ భగీరథ, విద్య, వైద్యం, రహదారులు, భవనాల శాఖ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, ఆర్టీసీ, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్ వంటి శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్​ జనార్దన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా మండలాల ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి : పాయల్ శంకర్ 

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాను ఈస్థాయికి వచ్చానన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎలాంటి సమస్యలు ఉంటాయో తనకు తెలుసని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు నేరుగా జిల్లాకు మంజూరు చేయాలని, ఇందుకోసం సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు చేయాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తెస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. 

ఏజెన్సీ సమస్యలపై దృష్టిపెట్టండి: బొజ్జు పటేల్​

ఏజెన్సీలో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. ఏజెన్సీలో టీచర్ల కొరత ఉందని, అటు ఆదివాసీలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఏజెన్సీలో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఉట్నూర్ లో జిల్లా స్థాయి ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, సమస్య పరిష్కారానికి రోజుల తరబడి తిప్పించుకునే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.   

పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా చూడాలి: అనిల్ జాదవ్ 

నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇదే సమావేశంలో జడ్పీటీసీగా సమస్యలను ప్రస్తావించానని, ఇక్కడి నుంచే తనకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు

ఇంద్రవెల్లి మండలంలో మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ఆ మండల జడ్పీటీసీ పుష్పలత సభ దృష్టికి తీసుకెళ్లారు. చాలా రోజుల నుంచి ఏజెన్సీ గ్రామాల్లో భగీరథ నీరు అందడం లేదని, అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే సొంత గ్రామపంచాయతీ పరిధిలోని చాప్రాల్ గ్రామంలో నీటి సరఫరా కావడం లేదని ఉట్నూర్ ఎంపీపీ జైవంత్ రావు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులు సైతం నత్త నడకన సాగుతున్నాయని, అటు అటవీ శాఖ పరిధిలోని రోడ్లకు అటవీ అనుమతులు రాక నిర్మాణాలు పెండింగ్​లో పడ్డాయని పలువురు సభ్యులు సమావేశంలో గుర్తు చేశారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల పలువురు జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఖుష్భు గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను జడ్పీ చైర్మన్, సభ్యులు సన్మానించారు.