కాంట్రాక్టులు.. కమీషన్లు ..ప్రాజెక్టుల చుట్టూ ఓరుగల్లు పాలిటిక్స్
కాంగ్రెస్, టీఆర్‍ఎస్ లీడర్ల పంచ్‍లు, ఆరోపణలు
కాంట్రాక్టర్లుగా మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు
ప్రెస్‍మీట్ లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్
వరంగల్ రూరల్, వెలుగు: ‘జిల్లాకు చెందిన ఫలానా మంత్రి మోసగాడు.. చరిత్రహీనుడు .. కమీషన్ లేకుంటే ఏ ఒక్క పనిచేయడు. ఎవ్వరిని ఆ పని చేయనివ్వడు. నమ్మినవారిని నట్టేటా ముంచే క్యారెక్టర్ అతనిది. పోలీసులను అడ్డుపెట్టుకుని నామీద కక్ష కడుతుండు’’.. ఓ ప్రతిపక్ష లీడర్ ప్రెస్‍మీట్ పెట్టిచేసిన ఘాటుకామెంట్స్. తెల్లారే ఇటు వైపు బ్యాచ్ మరో రివేంజ్ ప్రెస్‍మీట్.
‘‘మా మంత్రి మీద చవాకులు పేల్చే అపోజిషన్ లీడర్ ఓ రౌడీషీటర్.. దగాకోరు.. గుండాయిజంతో దొంగ కాంట్రాక్టులు పొందాడు. ఏ పని సక్కగా చేయలేదు. బ్యాంక్ చైర్మన్‍గా ఎక్కడ లేనంత స్కామ్ చేసిండు. ఎంక్వైరీ అనగానే కోర్టుకుపోయి స్టే తెచ్చుకుంటడు. అతడి కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టినా.. అతన్ని నగర బహిష్కరణ చేసినా బుద్ధిరావట్లేదు”అధికార పార్టీ లీడర్ల పంచ్‍లు. మొత్తంగా ఓరుగల్లులో పార్టీలు పెట్టే ప్రెస్‍మీట్లు కాస్తా ‘‘లీడర్లు.. కాంట్రాక్టర్లు.. ప్రాజెక్టులు.. అవినీతి’’.. చుట్టే చక్కర్లు కొడుతున్నాయి.
ప్రజాప్రతినిధులే.. కాంట్రాక్టర్లయే
జిల్లాలో ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్నారు. కొందరు బడా కాంట్రాక్టర్‍గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయితే.. మరికొందరు పొలిటికల్ గా స్ట్రాంగ్‍గా ఉండడంతో సరికొత్తగా ఈ పనుల వైపు చూస్తున్నారు. దీంతో నాణేనికి రెండు వైపులు ఉన్నట్లు లీడర్లు మల్టీరోల్ ప్లే చేస్తున్నారు. మరికొందరు చేతికి మట్టిఅంటకుండా భార్య, కొడుకు.. బావ, బామ్మర్ది పేరుతో ఈ రంగంలో దూసుకెళ్తున్నారు అంటే.. పనులు గుర్తించడం, ఎస్టిమేట్ వేయడం, పనులు దక్కించు కోవడం.. ఫండ్స్ తెప్పించు కోవడం.. క్వాలిటీ చూడడం.. జనాల్లో క్రెడిట్ కొట్టేయడం.. ఇవన్నీ చేసేది ఒక్కరే అన్నమాట. జిల్లాలో చూసినట్లయితే.. అధికార పార్టీలోని ఎమ్మెల్యేల్లో చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి వంటి ప్రధాన లీడర్లంతా కాంట్రాక్టర్లే. ఉమ్మడి జిల్లాలో ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా ఈ ముగ్గురు పేర్లే వినపడుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యేలు శంకర్‍నాయక్‍తో పాటు ఇతర లీడర్లు ప్రాజెక్టులు దక్కించుకుని తమ వాటా పొందుతారనే ప్రతిపక్షాల్లో ప్రచారం ఉంది. కాంగ్రెస్‍లో సైతం ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ధనసూరి సీతక్క, ప్రస్తుత జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఇదే ఫీల్డ్ లో తమదైన మార్క్ చూపుతున్నారు.
కొండా, జంగాపై.. కాంట్రాక్ట్ ఆరోపణలే
శనివారం హన్మకొండ సర్య్కూట్ గెస్ట్హౌస్‍లో నిర్వహించిన ప్రెస్‍మీట్‍లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు, జంగా రాఘవరెడ్డి కాంట్రాక్ట్ పనులపై ఆరోపణలు చేశారు. రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో కొండా దంపతులు, జంగా రాఘవరెడ్డి అవినీతికి పాల్పడ్డారని మాట్లాడారు. రూ.49.35 కోట్ల పనులు దక్కించుకుని వాటిని పూర్తి చేయలేదన్నారు. తక్కువ పనులు చేసి ఎక్కువ బిల్లులు పొందారని చెప్పారు. దాంతో ప్రభుత్వం కాంట్రాక్టును రద్దు చేసిందన్నారు.
కాంట్రాక్టర్‍గా.. ఇంజినీర్లపై ఎమ్మెల్యే చల్లా ఫైర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బడా కాంట్రాక్టర్ అనే విషయం అందరికీ తెలుసు. జిల్లాలోని పలు మేజర్ ప్రాజెక్టులతో పాటు సిటీలోని పలు రోడ్డు కాంట్రాక్టులు ఆయనకు సంబంధించినవారే చేస్తున్నారు. అదే టైంలో సకాలంలో బిల్లులు రాక అవి ముందుకు సాగడంలేదు. దీంతో జనం ముందు స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. వర్క్స్ ప్రొగ్రెస్ విషయంలో సొంత పార్టీలోనే తెరవెనక విమర్శలు మొదలయ్యాయి. కాగా, శుక్ర వారం హన్మకొండ అంబేద్కర్‍భవన్‍లో జరిగిన గ్రేటర్ మున్సి పల్ కౌన్సిల్ మీటింగ్లో చల్లాధర్మారెడ్డి ఎమ్మెల్యేగా హాజరైన ఆయన వాయిస్ మాత్రం ఓ కాంట్రాక్టర్ తన బాధను చెప్పుకున్నట్లే ఉంది. ‘‘సర్కార్ పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నరు.. చేసిన పనులకు బిల్లులు ఎప్పుడొస్తయో తెల్వది.. నేను కూడా బిల్లుల కోసం తిరుగుతున్నా.. బిల్లులో 20 శాతం కట్ చేసి ఇస్తున్నారు. అసలు కాంట్రాక్టర్లు బతకాల్నా చావల్నా చెప్పండి..’’అంటూ మాట్లాడారు. ‘‘క్వాలిటీ పేరుతో బిల్లులు తగ్గించడంపై.. అదేమైనా మీ అయ్యసొమ్మా..’’అంటూ ఇంజినీర్లపై మండిపడ్డారు. మొత్తంగా జిల్లాలో లీడర్లు కమ్ కాంట్రాక్టర్లు.. వారు దక్కించుకున్న ప్రాజెక్టులు అందులో అవినీతిపైనే.. మాటల యుద్ధాలు జరుగుతున్నా యి.
ఎర్రబెల్లి, జంగా..అవినీతి లొల్లి
జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్నపొలిటికల్ హీట్‍లో మంత్రి ఎర్రబెల్లి, కాంగ్రెస్ జనగామ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య ఓపెన్ వార్ నడుస్తోంది. ఇందులో పొలిటికల్ పంచ్‍లకు తోడు ప్రాజెక్టులు, కమీషన్లు మెయిన్ సబ్జెక్ట్ అయింది. జిల్లాలో ప్రాజెక్టులు, మేజర్ పనులు చేసే క్రమంలో బిల్లుల మంజూరులో దయాకర్‍రావు తనదైన మార్క్ చూపుతున్నారనే విమర్శ సొంత పార్టీలోనే వినపడుతోంది. తన బంధువులు, అనుకూలురైన వారికి సకాలంలో బిల్లులు ఇప్పించి .. మిగతావారివి పెండింగ్లో పెడుతున్నారనే భావన ఆ పార్టీలీడర్‍గా ఉంటూ కాంట్రాక్టులు చేసేవారిలో ఉంది. శుక్రవారం జంగా రాఘవరెడ్డి సైతం ఇదే ఆరోపణ చేశారు. ఎర్రబెల్లి కమీషన్ ఇవ్వడంలేదనే విస్నూర్ ప్రాజెక్ట్ పనులు ఆపుతున్నాడని ఆరోపించారు. దీనికి ప్రతివిమర్శగా శనివారం టీఆర్‍ఎస్ ఎమ్మెల్యే జంగా రాఘవరెడ్డిని ప్రెస్‍మీట్లో టార్గెట్ చేశారు. జంగా కన్‍స్ట్రక్షన్ పేరుతో రాఘవరెడ్డి ఏ ప్రాజెక్టులు చేశాడు. ఎలా కాంట్రాక్టులు దక్కించుకున్నాడు.. పనుల్లో కోట్లరూపాయల సర్కారు సొమ్మును ఎలా కొల్లగొట్టాడు అంటూ ఆరోపించారు.
For More News..