- లీడర్లకు బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి
గోదావరిఖని, వెలుగు : రామగుండం బీఆర్‌ఎస్‌లో అసమ్మతి లీడర్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసివస్తారా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. అసమ్మతి లీడర్లు పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి, టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, యూనియన్ లీడర్లు పాతపెల్లి ఎల్లయ్య, మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణలు కొంతకాలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల ఈ ఐదుగురిని మంత్రి కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడారు.
ఈక్రమంలో టికెట్దక్కించుకున్న కోరుకంటి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి తనకు సహకరించాలని కోరుతున్నారు. బుధవారం గోదావరిఖనిలోని దుర్గాదేవి టెంపుల్‌కు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో రాజిరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎల్లయ్యతో ఎమ్మెల్యే చందర్‌కు శాలువాతో సన్మానం చేయించారు.
అదే రోజు రాత్రి ఎల్లయ్యతో ఆయన నివాసంలో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. తనకు హైకమాండ్ నుంచి ఏదైనా హామీ వస్తేనే సహకరిస్తానని ఎల్లయ్య చెప్పినట్లు తెలుస్తోంది. కాగా జడ్పీటీసీ సంధ్యారాణి మాత్రం చందర్‌కు పోటీగా మరో పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.