నాయకులు ఉద్యమ సమయంలో కనబరుస్తున్న స్ఫూర్తి.. స్వపరిపాలనలో, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కనబరచడం లేదు. అవకాశం రాకపోవడం అందుకు ఒక కారణమైతే.. అవకాశం వచ్చినా.. ఉద్యమ ఆకాంక్షలు పక్కనబెట్టి అణచివేత ధోరణి ప్రదర్శిస్తుండటం మరో కారణం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు నాయకులను, రాజకీయ పార్టీల పోకడలను పరిశీలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయన్నది అర్థమవుతుంది.
నిజాం నవాబుకు, రజాకార్ల సైన్యానికి వత్తాసు పలికే దొరలూ, పటేండ్లు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిందే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. హైదరాబాద్ సంస్థానంలో కార్మికులు, కర్షకులు సహా అన్ని వర్గాల ప్రజలు ఏకమై నిజాం -రజాకార్ల సైన్యంపై పోరాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య మాత్రమే కాదు, ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరులో ముందుండి కొట్లాడిన కొమరం భీం, సుద్దాల హనుమంతు, సీపీఎం బీఎన్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ధర్మభిక్షం, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, బెల్లం నాగయ్య లాంటి ఎంతో మంది ఆదర్శప్రాయులయ్యారు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం రాజు తోక ముడిచాడు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో..
నిజాం నవాబు పాలనలో పైజామా, షేర్వాణి, కుచ్చుటోపీ పెట్టుకున్న దొరలు, పటేండ్లు, జమీందారులు, భూస్వాములు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గాంధీ టోపీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. వీరు తర్వాతి కాలంలో ఏర్పాటైన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో(1956) భాగస్వాములయ్యారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం నిజంగా పోరాడిన యోధులకు అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానం లభించలేదు. దీంతో వారు అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు హైదరాబాద్ తో ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకించలేకపోయారు. ప్రజలు, మేధావులు దాన్ని ఎంత కాదన్నా.. అప్పటి జాతీయ నాయకత్వం ఒత్తిడి మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఫలితంగా అప్పటి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం ప్రారంభమైంది. 1969 వరకు అన్ని వర్గాల ప్రజలు, నాయకులు ఉద్యమం చేశారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ14 స్థానాల్లో పోటీ చేసి10 స్థానాలు గెలుచుకుంది. తద్వారా ప్రత్యేక తెలంగాణ సాధించి తీరుతామనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. అప్పటి జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడో లేదా కొంత మంది స్వార్థ ప్రయోజనాలో తెలియదు కానీ.. తెలంగాణ ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ టైమ్ లోనూ ప్రజల అభీష్టం నెరవేరలేదు.
జనతా పార్టీ సమయంలో..
తర్వాతి కాలంలో పీవీ నర్సింహా రావు కు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మర్రి చెన్నారెడ్డికి గవర్నర్ పదవి వచ్చింది కానీ ఉద్యమంలో ముందు ఉన్న ఉద్యమ నేతలు రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు కానీ, ఎక్కడా సామాజిక న్యాయం పాటించలేదు. ప్రజల కోసం కొట్లాడిన వారికి అవకాశం ఇయ్యలేదు. అదే సమయంలో ఎమర్జెన్సీ రావడం, కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడం జరిగాయి. కమ్యూనిస్టు పార్టీలు అంతగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చే స్థితిలో లేవు అప్పుడు. అదే సమయంలో జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లి 1978 ఎన్నికల్లో సుమారు 60 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అప్పుడు జనతా పార్టీని నడిపే బాధ్యతలను బడుగు బలహీనవర్గాల నాయకుడిగా ఉన్న గౌతు లచ్చన్నకు ఇచ్చింది పార్టీ. ప్రతిపక్ష స్థానం నుంచి అధికారంలోకి వచ్చే సమయానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అనూహ్యంగా అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తగా ప్రాంతీయ పార్టీని ఎన్నుకున్నారనే కంటే.. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు, కమ్యూనిస్టు పార్టీలు వాటి అనుబంధ, అనుకూల మేధావులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో మరో జాతీయ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం చేశారనొచ్చు. స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు, బడుగు బలహీన వర్గాల మేలు కోసం పోరాడే నాయకులు రాజ్యాధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీఆర్ఎస్కు అధికారం ఇచ్చినా..
స్వరాష్ట్రంలో ప్రజలు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే అనే నినాదం సాకారమవుతుందని ప్రజలు భావించారు. కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్పార్టీ విఫలమైంది. పోరాటంలో మిగతా వాటి కంటే ముందుండి కొట్లాడిన ఆ పార్టీ.. తెలంగాణకు మొదటి సీఎం దళితుడే అనే మాట సహా ఎన్నో హామీలను పక్కన పెట్టేసింది. ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్.. ప్రజల పార్టీగా కాకుండా కుటుంబ పార్టీగా, ఉద్యమ పార్టీగా కాకుండా ఉద్యమద్రోహులను భుజాన మోసే పార్టీగా మారింది. పోనీ కాంగ్రెస్ పార్టీ అయినా.. టీఆర్ఎస్ను ఎదిరించే స్థాయికి చేరుకొని, ఉద్యమ ఆకాంక్షలను కాపాడుతుందని చూసిన ప్రజలకు ఆ పార్టీ కూడా నిరాశే మిగులుస్తోంది. గడిచిన రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం తంతుగా మారింది. ఇక మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు అంతంతే. ఇలా గత ఉద్యమాలను పరిశీలిస్తే.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నాయకులు, పార్టీలు విఫలమవుతూ వచ్చాయి. నీళ్లు, నిధులు, నియామకాలు సహా కొత్త రకం రాజకీయాలు కావాలని, తెలంగాణ అస్థిత్వ నినాదం, సామాజిక రాజ్యాధికార కల సాకారం కావాలని చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు బీజేపీ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ ఇతర పార్టీల్లా కుటుంబ పార్టీ, కుల పార్టీ, ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే పార్టీ కాదు. మోడీ ప్రధాని అయ్యాక ఒక దళితుడు రాష్ట్రపతి అయ్యాడు, అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు వచ్చాయి, బీసీలకు జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు అయ్యింది. దేశంలో మొదటిసారిగా మొన్నటి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 27 మంది బీసీలకు చోటు దక్కింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ప్రకటించింది. ఇలా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.
మలిదశ పోరాటంలో..
తెలంగాణ అస్థిత్వ పోరాటానికి మలిదశ ఉద్యమం ఒక కీలక మలుపు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, కుట్రలను, కుతంత్రాలను, పరిశీలించిన మేధావులు వాటిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇడ్లి సాంబార్ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమ వరకు ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటం చేశారు. ముఖ్యంగా మలి దశ తెలంగాణ ఉద్యమం 2000 నుంచి 2014 వరకు బాగా ప్రజల్లోకి వెళ్లింది. కేసీఆర్ టీఆర్ఎస్పార్టీని స్థాపించడం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ పార్టీకి సిద్ధాంత కర్తగా ఉండటం, ఆర్ఎస్ యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి, సకల జనులను చైతన్యం చేయడంలో జయశంకర్ సారు ముఖ్య పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ప్రజాసంఘాలు అన్నీ కలిసి ఉద్యమాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్లాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే బీజేపీ మద్దతుతో 2014లో తెలంగాణ కల సాకారమైంది.
డా. గుళ్లపల్లి సదానందం,సోషల్ ఎనలిస్ట్