- పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీపై ఆఫీసర్ల కసరత్తు
- సెప్టెంబర్ 6 నుంచి వార్డుల వారీగా లిస్టు రెడీకి ఉత్తర్వులు జారీ
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జీపీలు ఈసారి సారపాక, భద్రాచలంలో ఎన్నికలు జరిగేనా?
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పల్లెలపై అధికారులు, పొలిటికల్ లీడర్లు ఫోకస్ పెట్టారు. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్ 6 నుంచి పంచాయతీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ చేయాలని ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. దీంతో ఆర్నెళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తేనే సెంట్రల్ గవర్నమెంట్నుంచి ఫండ్స్ వస్తాయి. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు తెప్పించుకున్నారు. పోలింగ్ బాక్స్‌లను సిద్ధం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలు ఉండగా, గతంలో 479 పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. సారపాక, భద్రాచలానికి ఎన్నికలు జరగలేదు.
గెలుపు కోసం పార్టీల కసరత్తు..
- పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కాంగ్రెస్పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయమై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఆశవాహుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.
- సీపీఐ ఇప్పటికే పంచాయతీ ఎన్నికలపై కసరత్తు మొదలెట్టింది. ఇటీవల పార్టీ జిల్లా కమిటీ మీటింగ్‌లను నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా.. లేకున్నా అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్‌లు పెద్దగా పెట్టకపోవడంతో మెజార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ బాట పట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి బీఆర్ఎస్లో నెలకొందని ఆ పార్టీ నేతలే పేర్కొంటుండడం గమనార్హం.
- బీజేపీ, టీడీపీ, న్యూడెమోక్రసీ పార్టీలు తమకు పట్టున్న చోట గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.
ఈసారి భద్రాచలం, సారపాకలో ఎన్నికలు జరిగేనా?
భద్రాచలం, సారపాకలో ఎన్నికలు జరిగేనా అనే చర్చ జిల్లాలో మొదలైంది. పంచాయతీలుగా ఉన్న భద్రాచలం, సారపాకలను గత ప్రభుత్వం మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది. కానీ అమలు కాలేదు. ఈ క్రమంలో భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా, సారపాకను రెండు పంచాయతీలుగా విభజిస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇందుకు సంబంధించి గెజిట్రిలీజ్ కాకపోవడంతో అది పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా షెడ్యూల్ రిలీజ్ అయిన క్రమంలో భద్రాచలం, సారపాక పరిస్థితిపై ఆఫీసర్లతో పాటు పొలిటికల్ లీడర్లలో కొంత అయోమయం నెలకొంది.