కామారెడ్డి , వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలు ఆయా వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఈ ఎన్నికల్లో యూత్ ఓట్లు కీలకం కానుండడంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు యూత్‌కు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పోటా పోటీగా..
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 19, 24,178 మంది ఓటర్లు ఉండగా ఇందులో 39 ఏండ్ల లోపు వారు 9,34,975 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగం ఉన్న ఓటర్లే గెలుపోటములను డిసైడ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆశావహులు యూత్‌పై ఫోకస్ చేస్తున్నారు. గ్రామాల్లో పట్టణాల్లో పర్యటిస్తున్నప్పుడు యువతను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో తమ పార్టీ యూత్ లీడర్లకు ప్రాధాన్యమిస్తూ వారి ద్వారా తటస్థంగా ఉన్న యువకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం యువతకు పోటీలు, క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ, కొన్ని చోట్ల దావత్‌లు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా వారిని ఆకట్టుకునేందుకు పలు రకాల చర్యలు చేపడుతున్నారు.
పరిస్థితి ఇది..
కామారెడ్డి నియోజక వర్గంలో గత పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్సీనియర్ నేత షబ్బీర్‌అలీ ఇటీవల యూత్‌తో ఎక్కువగా చనువుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారిని ఆకర్షించే కార్యక్రమాలను పార్టీ యూత్ లీడర్లతో చేయిస్తున్నారు. బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ముందు నుంచే యూత్ పాలోయింగ్ ఎక్కువగా ఉంది. యూత్ పోగ్రామ్స్కు ప్రయార్టీ ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా యూత్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుద్యోగులకు కొద్ది రోజుల కింద వివిధ పోటీ పరీక్షల కోసం కోచింగ్ఇప్పించారు. యూత్లీడర్లను గ్రామాల్లో తిప్పుతున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ని తాడ్వాయి మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ తరఫున ఓ లీడర్ ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు గ్రామాలు, తండాల్లోని యువత మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేర్చుకోవడం, వారితో గ్రామాల్లో ప్లెక్సీలు కట్టిస్తూ సందడి చేస్తున్నారు. బాన్స్వాడ, జుక్కల్ నియోజక వర్గాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ యూత్‌పై ఫోకస్చేశాయి. ఈ నియోజక వర్గాల్లోనూ నేతలు కూడా యూత్‌ను ఆకర్షించేందుకు అక్కడక్కడ స్పోర్ట్స్కిట్స్పంపిణీ షురూ చేశారు.
యూత్ ఓటర్ల వివరాలు
కామారెడ్డి నియోజక వర్గంలో మొత్తం 2,27,867 మంది ఓటర్లు ఉండగా.. అందులో 40 ఏండ్ల లోపు వారు 1,07,129 మంది ఉన్నారు. ఎల్లారెడ్డిలో 2,07,675 మందిలో 40 ఏండ్ల లోపు వారు 1,02,106 మంది ఓటర్లు ఉన్నారు. బాన్స్వాడలో 1,82,492 మంది ఉంటే 91,146 మంది యూత్ ఓటర్లు ఉన్నారు. జుక్కల్‌లో 1,89,13 మందికి 40 ఏండ్ల లోపు వాళ్లు 99,041 మంది ఉన్నారు.