ఏడు నెలల్లో ఖాళీ కానున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం
మొదలైన ఆశావహుల కసరత్తు
ఓటర్లతో సంప్రదింపులు
ప్రచారంలోకి ప్రొఫెసర్ కోదండరామ్, మరో ఎమ్మెల్యే సోదరుడి పేర్లు
నల్గొండ, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఓటర్ల జాబితాను ముందేసుకుని ఆశావహులు కుస్తీ పడుతున్నారు. పట్టభద్రుల ఎన్నికగురించి మొదట్లో అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ గత రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన విధానంలో భారీ తేడా కనిపించింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరగడానికి కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త ఓటరు నమోదుకు షెడ్యూల్ జారీ చేయడం, దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఓటరు నమోదుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే దీనికంటే ముందుగానే ఆశావహులు గత ఎన్నికల్లో జరిగిన తీరుతెన్నులు, ఓటర్లజాబితా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ఆశావహులు ఓటర్లను ఫోన్లో సంప్రదించడంతో పాటు, పలుచోట్ల వివిధ సంఘాల ప్రతినిధులతో మీటింగ్లు ఏర్పాటు చేసి వారి వాయిస్ వినిపిస్తున్నారు.
మూడుసార్లు టీఆర్ఎస్సే
శాసనమండలి పునరుద్ధరణ జరిగాక 2007లో జరిగిన ఎన్నికల్లో డ్రా పద్ధతిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలాన్ని నిర్ణయించారు. దీంతో అప్పుడు టీఆర్ఎస్ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ రెండేళ్లకు ఎన్నికయ్యారు. రెండేళ్లపదవీకాలం కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రసాధనలో భాగంగా 2008లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత దాదాపు 13 నెలలపాటు ఈ స్థానం ఖాళీగానే ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో దిలీప్ కుమార్ రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరేళ్లపదవీ కాలం తర్వాత మూడోసారి 2015 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైన అందరి దృష్టి పడింది.
For More News..