- బజ్జీలు వేస్తున్రు.. ఇస్త్రీ చేస్తున్రు.. ఇలా ఎన్నెన్నో వి‘చిత్రాలు’
ఖమ్మం, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు, జనాన్ని ఆకట్టుకునేందుకు లీడర్లు పడరాని పాట్లు పడుతున్నరు. ఫొటోలకు ఫోజులిస్తున్నరు.. ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నరు. ప్రచారంలో తిరుగుతున్న సమయంలో టిఫిన్ సెంటర్ కు వెళ్తే దోశలు వేస్తున్నరు. సాయంత్రమైతే బజ్జీలు కాల్చి ప్లేట్లలో కస్టమర్లకు వడ్డిస్తున్నరు. దుస్తులు ఐరన్ చేయడం దగ్గర నుంచి కిల్లీలు కట్టడం వరకు అన్నింటిలోనూ తమ ప్రావీణ్యాన్ని చూపిస్తున్నరు. పొద్దున్నే ప్లే గ్రౌండ్ కు వెళ్లి అక్కడి ఓపెన్ జిమ్ లో కుస్తీలు పడుతున్నరు.
అక్కడే యువకులతో కలిసి క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శిస్తున్నరు. ఎండపూట బడ్డీ కొట్టుకు వెళ్లి గోలీ సోడాతో బుస్ మనిపిస్తున్నరు. ఇలా ప్రధాన పార్టీల లీడర్లు, అభ్యర్థులు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఓట్లు సాధించడమే లక్ష్యంగా జనంతో కలిసిపోతున్నరు. ఈ ట్రిక్కులన్నీ గమనిస్తున్న ఓటర్లు మాత్రం ఓట్లేసే వరకే లీడర్లు తమ చుట్టూ చక్కర్లు కొడతారని, ఆ తర్వాత ఏ పని కోసమైనా అదే లీడర్లు తమ ఇంటి చుట్టూ తిప్పించుకుంటారని పెదవి విరుస్తున్నరు.