పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులను హడావుడిగా మొదలు పెట్టిన నేతలు

  • ఏడేండ్లుగా అభివృద్ధి మరిచి.. ఎన్నికలొస్తున్నాయని ఆగమాగం
  • కేటాయించిన నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్​
  • పనులు ప్రారంభం కావడంతో ఎన్నికల స్టంట్​అంటున్న ప్రజలు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులను హడావుడిగా మొదలు పెట్టారు. ఏడేండ్ల కింద టే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉన్నా పట్టించుకోలేదు. త్వరలో ఎన్నికలు రానున్నందున ఇపుడు ఆగమాగంగా పనులు ప్రారంభిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడేళ్ల ముందు మినిస్టర్ కేటీఆర్ పెద్దపల్లి జిల్లా అభివృద్ధి, పట్టణీకరణ కోసం నిధులు కేటాయించారు. 2017–18లో పెద్దపల్లి మున్సిపా లిటీలో రూ.10.08 కోట్లు, మంథని, సుల్తానా బాద్ లో  రూ.3.96 కోట్లతో పనులు ప్రారంభించారు. అలాగే 2016 ఏప్రిల్​లో మంత్రి కేటీఆర్ పెద్దపల్లి సిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కేటాయించారు. రెండో దఫా రూ.25 కోట్లు కేటాయించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మినీ ట్యాంక్​బండ్లు, ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా తదితర పనులను చేపట్టినా ముందుకు సాగలేదు.  

మంత్రి స్టార్ట్ చేసిన పనులకే దిక్కులేదు..

2016లో మంత్రి కేటీఆర్ పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లిలోపాటు మంథనిలో మినీ ట్యాంక్​బండ్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మినీ ట్యాంక్​బండ్​ కట్టి బోటింగ్ ఏర్పాటు చేస్తామని, ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీ సిస్టం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తామని చెప్పిన నాయకులు 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. మంత్రి చెప్పగానే ఆగమేఘాల మీద పెద్దపల్లి మున్సిపల్ బిల్డింగ్ కూల్చేశారు. కొత్త బిల్డింగ్ కోసం రూ.3.85 కోట్లతో డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం అంగీకరించినా పనులు మాత్రం మొదలు కాలేదు. ఆరేండ్లలో బిల్డింగ్ నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. రూ.5.45 కోట్లతో కొత్తగా డీపీఆర్​ తయారు చేశారు. పెద్దపల్లిలో రూ. 6 కోట్లతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ సిస్టం, రూ.5 కోట్లతో నిర్మిస్తామన్న  ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు ప్రారంభం కూడా కాలేదు.  

లీడర్లకు అవసరమైనవి ముందు కట్టుకున్నరు..

ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమైన లీడర్లు తమకు అవసరమైన నిర్మాణాలు మాత్రం స్పీడుగా చేసుకున్నారు. పెద్దపల్లిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి జాగా చూడటంతోపాటు ఏడాదిలోపే నిర్మించి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో పాత గెస్ట్​హౌజ్​ను కూల్చేసి
 కొత్తది కట్టారు.