- సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం
- ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు
- జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్ లో ఉన్నారు. తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు మరో ఎలక్షన్ కోసం ప్రచారంలో మునిగిపోయారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని చేస్తున్నారు.
నిన్న, మొన్నటి వరకు ఎంపీ ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఆయా పార్టీల ముఖ్య నేతలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై నజర్ పెట్టారు. ఉద్యోగులు, లాయర్లు, టీచర్లు, ఇలా ఆయా రంగాలకు చెందిన వారితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి గడువులోనే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాలను కవర్ చేయాల్సి వస్తుండడంతో ప్రచారానికి అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు.
వరుసగా మీటింగ్‌లు...
నిన్న, మొన్నటి వరకు ఎంపీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావుడి కనిపించలేదు. ఎంపీ ఎలక్షన్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా పార్టీల లీడర్లు కూడా ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకే రోజు ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా, నియోజకవర్గ కేంద్రాల్లో వరుస మీటింగ్ లు పెడుతున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న తీన్మార్ మల్లన్న శుక్రవారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఆ తర్వాత జిల్లా పరిధిలో పలు మీటింగ్ ల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి శుక్రవారం ఒకే రోజు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు.
ఖమ్మంలో వాకర్లతో మీటింగ్ తర్వాత, లాయర్లతో సమావేశమయ్యారు. భద్రాచలం, పినపాకల్లో మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జిల్లాల్లో పర్యటిస్తూ, గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తున్నారు. అయితే జనరల్ ఎన్నికల్లాగా ఒకేసారి వేలాది మంది ఓటర్లను కలిసే అవకాశం లేకపోవడం
నాలుగున్నర లక్షల మంది ఓటర్లు 12 జిల్లాల పరిధిలో ఉండడంతో వారిని కలవడం అందరు అభ్యర్థులకు సవాల్ గా మారుతోంది. ఇతర ఎన్నికల్లాగా బహిరంగ సభలు పెట్టే చాన్స్ లేక, 50, 100 మందితో చిన్న మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.
బరిలో 52 మంది..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది ఉన్నారు. మొత్తం 63 మంది నామినేషన్లు వేసినా, 11 మంది ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్), బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీలో నిలిచారు. తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి 2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీపడ్డారు.
ఆ ఎలక్షన్లలో ఇండిపెండెంట్ గా పోటీచేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడాయన కాంగ్రెస్ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించగా, ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
4,61,806 మంది పట్టభద్రులు..
ప్రస్తుతం 12 జిల్లాల పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మహిళలు, ఇతరులున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఎలక్షన్ కౌంటింగ్ ఉండనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండగా, 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన వ్యవహరిస్తున్నారు.