- రెండు సెగ్మెంట్లలో మొదలైన ఎన్నికల వేడి
- టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఆశావహులు
- అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో కాంగ్రెస్ తీవ్ర పోటీ
- బీఆర్‌ఎస్, బీజేపీ తరఫున ఆసక్తి చూపిస్తున్న సీనియర్లు
నల్గొండ, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్‌స్థానాల్లో పోటీకి ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ, బలాబలాలు బేరీజు వేసుకొని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్ననే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్‌లో పదేళ్లుగా ఎలాంటి పదవి లభించని సీనియర్లు ఎంపీ టికెట్‌కోసం ఫైట్చేస్తున్నారు. బీజేపీ నుంచి సైతం సీనియర్లు బరిలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నా రు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సామాజిక సమీకరణాలే ప్రధానం
ఎంపీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎంపీసెగ్మెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆలేరుతోనే సరిపెట్టింది. ఇక బీఆర్ఎస్ పాత సంప్రదాయాన్నే కొనసాగించింది. కోదాడ, నాగార్జునసాగర్ బీసీలకు ఇచ్చింది. బీజేపీ సైతం ఆలేరు, నల్గొండలో బీసీ అభ్యర్థులతో ప్రయోగం చేసి ఫెయిలైంది.
ఇదే ఫార్ములా పార్లమెం ట్ ఎన్నికల్లో కొనసాగుతుందనే నమ్మకం లేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. 2018 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు ఎంపీ సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడంతో విజయం సాధించింది. అదే బీఆర్ఎస్ నల్గొండ సీటు రెడ్లకు, భువనగిరి బీసీలకు ఇచ్చింది. దీనివల్ల ప్రతికూల ఫలితాలే వచ్చాయి. బీజేపీ నల్గొండ స్థానాన్ని ఆర్యవైశ్యులకు, భువనగిరి వెలమ సామాజిక వర్గానికి కేటాయించినా.. విజయం దక్కలేదు.
కాంగ్రెస్ పక్కా వ్యూహం
అసెంబ్లీ ఎన్నికల ఆపరేషన్ విజయవంతం చేయడంలో కాంగ్రెస్ అగ్రనేతలు సక్సెస్ అయ్యారు. 12 స్థానాలకు గాను 11 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇదే తరహా వ్యూహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తాజా మాజీ ఎంపీలను ఇన్చార్జిలుగా నియమించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంత ఆషామాషీ కాదని తేలిపోయింది. నల్గొండ ఎంపీగా సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ చివరకు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఊహించలేమని సీనియర్‌నేత ఒకరు చెప్పారు.
అట్లాగే భువనగిరి సెగ్మెంట్ నుంచి చామల కిరణ్ కుమార్‌రెడ్డి రేసులో ఉన్నానని చెబుతున్నా...జానారెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పార్టీ వదిలివెళ్లినప్పుడు డీసీసీ ప్రెసిడెంట్‌గా కసిరెడ్డిని నియమిస్తారని భావించారు. కానీ, ఆయన ఎంపీ సీటుపై కసిరెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పట్టు నిలుపుకునే పనిలో బీఆర్‌ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి రావడం మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి అక్కడక్కడ ఆత్మీయ సమావేశాలు పెడ్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారు పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డిని సంప్రదిస్తున్నట్టు తెలిసింది. పార్టీ ఆదేశిస్తే నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని గు త్తా అమిత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అదేబాటలో బీసీ సామాజిక వర్గా ని చెందిన సీనియర్ నేత సుంకరి మల్లేశ్‌గౌడ్ సైతం పోటీ చేస్తానని చెబుతున్నారు.
డీసీసీబీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ మల్లేశ్‌గౌడ్‌తో పాటు తెలంగాణ ఉద్యమనేత చాడ కిషన్ రెడ్డి సైతం రేసులో ఉన్నారు. భువనగిరి సెగ్మెంట్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్చెరుకు సుధాకర్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్లు వినిపిస్తుండగా, ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని సీనియర్లు అంటున్నారు.
బీజేపీలో సీనియర్ల ఆసక్తి
బీజేపీలో సీనియర్లు, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకులు పార్లమెంట్ రేసులో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకు లు ప్రముఖ న్యాయవాది నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూధన్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నర్సింహారెడ్డి భావించారు. కానీ పార్టీ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్సైంది. అయితే ఈ దఫా ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మధుసూధన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయానికి రావడమేగాక, నిధుల సమీకరణ కోసం విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేందర్ కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో శ్యాంసుందర్‌రావు ఎంపీగా పో టీ చేశారు. అయితే ఎంపీ టికెట్ హామీ ఇవ్వడంతోనే నర్సయ్యగౌడ్ బీఆర్ ఎస్ నుంచి బీజేపీలో చేరారని చెబుతున్నారు. కానీ శ్యాంసుందర్‌రావు తనకే టికెట్ వస్తదన్న నమ్మకంతో నియోజకవర్గాల వారీగా పార్టీ మీటింగులు పెట్టి కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.