షుగర్​ ఫ్యాక్టరీలపై ప్రకటన చేశాకే .. కేసీఆర్​ కోరుట్ల గడ్డపై అడుగుపెట్టాలె..

  •    లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు
  •     ప్రభుత్వపరంగా నడిపిస్తామని..మొత్తానికే మూసేసిన్రు.. 
  •     కోరుట్లలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తాం
  •     జగిత్యాల జిల్లా రైతు సంఘాల నాయకుల హెచ్చరిక

మెట్ పల్లి, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను వంద రోజుల్లో స్వాధీనం చేసుకొని ప్రభుత్వపరంగా నడిపిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. తొమ్మిదేండ్లు దాటినా చేసిందేమీ లేదని జగిత్యాల జిల్లా రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న  ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ.. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తుండగా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బంద్ చేసి వేలాది మంది రైతులు, కార్మికుల ఉపాధి కొల్లగొట్టారన్నారు. మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించాలని తొమ్మిదేండ్లుగా ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు చేసినా సర్కారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించాకే కోరుట్ల గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. 

కోరుట్లకు వచ్చే ముందు ప్రకటన చేయాలని లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్​ అభ్యర్థులుగా 179 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారని, షుగర్ ఫ్యాక్టరీలు రీ ఓపెన్ చేస్తామని సీఎం ప్రకటించకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెరుకు రైతులందరం కలిసి 200కు పైగా నామినేషన్లు వేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమకు అధికారమిస్తే ఆరు నెలల్లో ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రకటిస్తున్నారని, బీఆర్ఎస్ సర్కారు మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదని, దీన్ని బట్టి రైతులంటే వారికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతోందన్నారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ప్రెసిడెంట్ మామిడి నారాయణ రెడ్డి, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ ప్రెసిడెంట్ గురిజల రాజారెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకుడు బద్దం శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, అశోక్, నడ్పి నర్సారెడ్డి, శంకర్, రాజారెడ్డి, బొర్రన్న, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.