- మంచిర్యాల జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ గోదావరి బ్రిడ్జి సాధన సమితి నిరసన
మంచిర్యాల, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో మంచిర్యాల జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని గోదావరి బ్రిడ్జి సాధన సమితి నాయకులు విమర్శించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్శనివారం నాటి జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ 'కేసీఆర్గో బ్యాక్' అంటూ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరి వద్ద బ్రిడ్జి సాధన సమితి కన్వీనర్ తుల మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. 2018లో గోదావరిపై మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి విఫలమయ్యారని అన్నారు.
ఈ ప్రాంతంలో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని మోసం చేశారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాల టౌన్‌తో పాటు జిల్లాలోని పలు గ్రామాలు, వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని, వరద బాధితులను కేసీఆర్ కనీసం పరామర్శించలేదని వారు ఫైర్అయ్యారు. సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన సీఎస్సార్, డీఎంఎఫ్టీ ఫండ్స్‌ను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు తరలించకుపోయిన ద్రోహి కేసీఆర్అని మండిపడ్డారు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ
శాలివాహన పవర్ ప్లాంట్‌ను మూసివేయడంతో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జిల్లాకు అడుగడుగునా అన్యాయం చేసిన కేసీఆర్ మరోసారి ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్ల నాగేంద్ర ప్రసాద్, కలకుంట్ల మల్లయ్య, బానోత్ దాస్య, ఐ.శివకుమార్ పాల్గొన్నారు.