- రేవంత్ రెడ్డి, జానారెడ్డి వర్గం నుంచీ ఎదురుగాలి
- బ్రదర్స్ రాజకీయంగా విడిపోవడంతోనే తగ్గిన బలం
నల్గొండ, వెలుగు : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో ప్రయారిటీ ఇవ్వట్లేదనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలప్పటి నుంచి ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు సొంత పార్టీ నేతలే యత్నిస్తున్నట్లు ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల హైకమాండ్ ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో వెంకటరెడ్డికి చోటు దక్కకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటోంది. ఇదేసమయంలో పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మాత్రం కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వడం వెనుక బలమైనరాజకీయ కోణం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
బ్రదర్స్హవా తగ్గినందుకేనా...?
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో బ్రదర్స్హవా పదేళ్ల పాటు సాగింది. 2009 ఎన్నికల మొదలు 2018 ఎన్నికల వరకు బ్రదర్స్ రాజకీయంగా చక్రం తిప్పారు. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైం భువనగిరి ఎంపీగా, వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజక వర్గాల్లో బ్రదర్స్హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఓడిపోవడంతో కొంత గ్రాఫ్ తగ్గినట్టు కనిపించింది.
కానీ, లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపొందడంతో మళ్లీ జోష్ పెరిగింది. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో బ్రదర్స్ తీవ్ర మనస్తాపం చెందారు. ముఖ్యంగా పీసీసీ పదవి వస్తదని ఆశించిన వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి రూపంలో గట్టిషాక్ తగిలింది. తర్వాత 2018 ఎన్నికల్లో వెంకటరెడ్డి ఓడిపోగా, రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. వెంకటరెడ్డి ఆ మరుసటి ఏడాది జరిగిన ఎంపీ ఎలక్షన్లో భువనగిరి నుంచి గెలిచారు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి, లింగయ్య ఇద్దరు చెరోదారి చూసుకోవడంతో వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఒంటివారయ్యారు.
మునుగోడు బైపోల్నుంచే కౌంట్‌డౌన్...
మునుగోడు బైపోల్నుంచే వెంకటరెడ్డి కౌంట్ డౌన్ మొదలైందని ఆయన వ్యతిరేకవర్గం చెబుతోంది. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి సహరించారని, పార్టీ నుంచి వెళ్లిపోవాలని రేవంత్ రెడ్డి వర్గం బాహాటంగానే విమర్శ లు చేసింది. నిజానికి బైపోల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బ్రదర్స్రాజకీయం ఇంకోరకంగా ఉండేది. కానీ, రెండు సార్లు పీసీసీ పదవి మిస్సవడం, రాజగో పాల్ రెడ్డి, లింగయ్య పార్టీ నుంచి వెళ్లిపోవడం లాంటి సంఘటనలు వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీశాయి. దీంతో చాలా రోజులు వెంకటరెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీన్ని అదునుగా భావించిన పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నల్గొండ, నకిరే కల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సపోర్ట్‌తో కొందరు, జానారెడ్డి వర్గం పేరుతో ఇంకొందరు రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ చెప్పినోళ్లుకు టికెట్లు దక్కేనా..?
పార్టీలోకి వ్యతిరేక వర్గం బలపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో వెంకటరెడ్డి పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి సెగ్మెంట్లలో ఇటు రేవంత్, అటు జానారెడ్డి వర్గం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నకిరేకల్ లాంటి చోట్ల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులే టి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట్ రెడ్డి చెప్పినోళ్లకు టికెట్లు వస్తాయా..? అనే చర్చ జరుగుతోంది.
నల్గొండ నుంచే పోటీచేస్తానని ప్రకటించిన వెంకటరెడ్డి అవసరమైతే తన సీటును బీసీల కోసం త్యాగం చేస్తానని ప్రకటించారు. కానీ, కొద్దిరోజులకే తిప్పర్తి మండలంలోని తిప్పాలయగూడెం అమ్మవారి టెంపుల్ నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆయన ఇన్నాళ్లు భువనగిరిపైనే ఫోకస్ చేయడంతో నల్గొండలో కేడర్చెల్లాచెదురైంది. పాత టీమ్‌ను తనదారిలోకి తెచ్చుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు.