- జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఇన్ చార్జిలుగా ఎమ్మెల్యేలు, సీనియర్లు
- గెలిపించడమే లక్ష్యంగా మీటింగ్‌లు, పర్యటనలు
కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్ ఎంపీ స్థానం గెలిపించే బాధ్యతను ప్రధాన పార్టీల లీడర్లు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. బీజేపీ , బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముఖ్య నేతలకు ఎంపీ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించగా.. వారు పోటీపడి మరీ ప్రచారం చేస్తూ తమ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు పార్టీ అప్పగించిన ఏరియాల్లో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చి తమ ఆధిక్యాన్ని చాటేందుకు శ్రమిస్తున్నారు.
ఇన్ చార్జి బాధ్యతలు తీసుకున్న నేతలు తమ పరిధిలో మెజార్టీ ఓట్లు తీసుకురావడం లక్ష్యంగా పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించాలన్న పట్టుదలతో నియోజకవర్గ ఇన్ చార్జిలు కష్టపడుతున్నారు
పార్టీ నుంచి ఎవరెవరంటే
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. బీజేపీకి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా.. బీఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బాధ్యతలు తలకెత్తుకున్నారు.
చేరికలపై ఫోకస్
జహీరాబాద్ పార్లమెంటు పరిధి మొత్తానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి సెగ్మెంట్ లో షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నాయకుల చేరికలపై ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయి మీటింగ్ లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించడమే టార్గెట్ గా దూసుకుపోతున్నారు.
బాన్పువాడలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య లీడర్లు, కార్యకర్తల్ని పార్టీలో చేర్చుకొని క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుతున్నారు. జుక్కల్ లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మండల స్థాయిలో మెజార్టీ ఓట్ల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
అంతా వెంకటరమణారెడ్డే
బీజేపీ తరఫున జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చూస్తున్నారు. తన నియోజక వర్గంతో పాటు, మిగతా నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ ఓట్ల సాధనకు కసరత్తు చేస్తున్నారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, జుక్కల్‌లో పార్టీ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అరుణతార ఇన్‌చార్జిగా వ్యవహారిస్తున్నారు.
తిరిగి దక్కించుకోవాలని తాపత్రయం
ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని గులాబీ నేతలు ఆరాటపడుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో నిర్వహిస్తున్న మీటింగ్‌లకు ఆయనే హాజరవుతున్నారు. రెండు చోట్ల హరీశ్ రావు కూడా ఈయనతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానం బాన్సువాడ కాగా.. ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించాలని పోచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కామారెడ్డి బాధ్యతల్ని మాజీ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంతుషిండే ఇన్‌చార్జిగా పార్టీ అప్పగించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. ఆయా చోట్ల లీడర్లు పార్టీ మారారు. ఈ పరిస్థితుల్లో మెజార్టీ సాధించి తమ సత్తా చాటుకునేందుకు ఇన్చార్జిలు ప్రయత్నిస్తున్నారు.