న్యూఢిల్లీ: ఉభయ సభల్లో మూడో రోజైన గురువారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. న్యూయార్క్‌లో అదానీపై నమోదైన కేసు వ్యవహారంపై చర్చించాలని అపోజిషన్ పార్టీల నేతలు పట్టుబట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే అదానీని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. జేపీసీ వేయాలని వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చినా అటు లోక్‌సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ తిరస్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జేపీసీ వేసేదాకా తమ ఆందోళనలు కొనసాగుతాయంటూ అపోజిషన్ పార్టీల నేతలు వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా, యూపీలోని సంభాల్‌లో మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లపై కూడా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఏడాది కాలంగా మణిపూర్‌లో చెలరేగుతున్న అల్లర్లపైనా చర్చకు డిమాండ్ చేశాయి. సహకరించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎంత రిక్వెస్ట్ చేసినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికి శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
రూ.8వేల కోట్లతో 8 సిటీలు డెవలప్ చేస్తం
8 రాష్ట్రాల్లో 8 సిటీలను కేంద్రం డెవలప్ చేస్తుందని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి తోఖాన్ సాహు లోక్‌సభలో తెలిపారు. దీని కోసం 23 రాష్ట్రాల నుంచి 28 ప్రపోజల్స్ వచ్చాయని క్వశ్చన్ అవర్‌లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రపోజల్స్‌ను కేంద్రం పరిశీలిస్తున్నదని తెలిపారు. ఒక్కో స్టేట్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. ఆయా రాష్ట్రాలు పంపిన సిటీల పరిస్థితులు, అర్హతలపై కమిటీ స్టడీ చేసి ఫైనల్ చేస్తదని చెప్పారు.
పీఎం కేర్ కింద 4,543 మంది చిన్నారులకు లబ్ధి
33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పీఎం కేర్ కింద 4,543 మంది చిన్నారులు లబ్ధి పొందారని రాజ్యసభలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చట్టపరంగా ఆసరా కల్పించేందుకు 2021, మే 29న పీఎం కేర్ ను లాంచ్ చేశామన్నారు. 613 జిల్లాల నుంచి 9,332 అప్లికేషన్లు వచ్చాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. 8,808 అప్లికేషన్లను జిల్లా స్థాయిలో వెల్ఫేర్ కమిటీలు రివ్యూ చేశాయన్నారు. చివరికి 4,543 మంది చిన్నారులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందారన్నారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులు అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.
రాజ్యసభలోనూ అదే రగడ
అటు రాజ్యసభలోనూ అదానీ వ్యవహారం, మణిపూర్, సంభాల్ లో చెలరేగిన అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభను అడ్డుకోవడం సరికాదని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్.. హుందాగా వ్యవహరించాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. దేశ భవిష్యత్తు గురించి చర్చించాల్సిన చోట నిరసన తెలియజేయడం బాధాకరమన్నారు. అర్థవంతమైన చర్చలో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండటంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.