యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతిపై రాజకీయ పార్టీల లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను పట్టించుకోకపోవడం, ఆందోళన చేస్తున్న ప్రజలతో మాట్లాడకపోవడంతో ప్రభుత్వానికి మైనస్ అవుతుందని బీఆర్‌ఎస్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సెంట్రల్ మినిస్టర్లు వచ్చిన ప్రోగ్రామ్స్‌ను కూడా పట్టించుకోవడం లేదని బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజావాణిలో అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలను పోలీసులు తనిఖీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బస్వాపురం కట్టపైనే నిర్వాసితులు
యాదాద్రి జిల్లాలో వాసాలమర్రి పునర్నిర్మాణం, బస్వాపురం నిర్వాసితులు, ట్రిపుల్ ఆర్ బాధితులపై నిత్యం చర్చ జరుగుతోంది. బస్వాపురం రిజర్వాయర్ కారణంగా బీఎన్.తిమ్మాపురం గ్రామస్తులు ఇండ్లు, భూములు కోల్పోతున్నారు. వారికి మూడేండ్లుగా పరిహారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం ఇవ్వాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు 28 రోజులుగా రిజర్వాయర్ కట్టపైనే ఆందోళన, వంటవార్పు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం కలెక్టర్‌ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు.
రాయగిరి రైతుల బాధనూ పట్టించుకుంటలే...
‘ఇప్పటికే పలుమార్లు భూములు ఇచ్చాం.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పేరుతో మరోసారి భూములు తీసుకోవద్దు’ అని యాదాద్రి జిల్లా రాయగిరి రైతులు ఆందోళన చేస్తున్నారు. పలు ప్రాజెక్టుల పేరుతో రాయగిరికి చెందిన రైతుల నుంచి ఇప్పటికే ప్రభుత్వం 145 ఎకరాలు సేకరించింది. తాజాగా
ట్రిపుల్ ఆర్ పేరుతో మరో 266 ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో బాధితులు సర్వేను అడ్డుకుంటున్నారు. ఇదే విషయంలో ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడంతో పాటు రాస్తారోకోలు, హైవే దిగ్బంధనం చేశారు. గురువారం కూడా ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకోవడంతో పలువురు మహిళలకు గాయాలు అయ్యాయి. అయినప్పటికీ కలెక్టర్ వారితో ఎలాంటి చర్చలు జరిపిన దాఖలాలు లేవు.
సీఎస్ సీరియస్ అయితేనే వాసాలమర్రి కదలిక
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణం విషయంలో ఏడాదిన్నరగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ ఏడాది జూలైలో డీపీఆర్ పంపించినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. గ్రామంలో కొత్త ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆఫీసర్లు అనుమతులు ఇవ్వడం లేదు.
ఇటు ప్రభుత్వం ఇండ్లు కట్టించకపోవడం.. అటు సొంతంగా నిర్మించుకుంటామంటే పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పేషీలో కదలిక మొదలైంది. ఏకంగా సీఎస్ సోమేశ్‌కుమారే స్పందించి కలెక్టర్‌పై సీరియస్ అయ్యారు. ఆ తర్వాతే అన్ని డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు.
ప్రభుత్వానికి మైనస్ అవుతుందని బీఆర్‌ఎస్...
యాదాద్రి జిల్లాలో నెలకొన్న ముఖ్యమైన మూడు సమస్యలపై కలెక్టర్ స్పందించకపోవడం, బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంపై అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ మూడు సమస్యల కారణంగా ప్రభుత్వానికి మైనస్ అవుతున్నా కలెక్టర్ పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రొటోకాల్ పాటించరా అని బీజేపీ ఆగ్రహం
కలెక్టర్ వైఖరిపై బీజేపీ లీడర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యాదాద్రికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌లో రివ్యూ కోసం ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు వచ్చారు. ఆ ప్రోగ్రామ్స్‌కు కలెక్టర్ గైర్హాజర్ అయ్యారు. దీనిపై బీజేపీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఎవరు వచ్చినా ఠంచన్‌గా హాజరయ్యే కలెక్టర్ గవర్నర్, సెంట్రల్ మినిస్టర్లను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.