ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం

ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం
  • క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు
  •  కామారెడ్డి జిల్లాకు రానున్న అగ్రనేతలు

కామారెడ్డి ​, వెలుగు: ఎంపీ ఎన్నికల పోలింగ్​గడువు దగ్గరపడుతుండటంతో కామారెడ్డి  జిల్లాలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్​ చేశారు.  ప్రచారానికి ఇంకా అయిదు రోజులే మిగిలి ఉండగా..  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  మండుటెండను లెక్కచేయకుండా ఎలాగైనా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  కొద్ది రోజులుగా నియోజక వర్గ కేంద్రాలు, మండల స్థాయిలో కార్యకర్తలతో మీటింగ్‌లు నిర్వహించిన నేతలు ప్రస్తుతం గ్రామాల్లో కూడా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. కుల సంఘాలు, ఆయా వర్గాల నేతల భేటీ అవుతున్నారు. గెలిచిన తర్వాత తాము చేపట్టే పనులపై హామీ ఇస్తున్నారు. 

7న కేసీఆర్, 9న ప్రియాంక, రేవంత్ రెడ్డి  

ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి అగ్రనేతలు కామారెడ్డి జిల్లాకు  రానున్నారు.  బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థి గాలి అనిల్​కుమార్​ తరఫున ప్రచారానికి ఈనెల 7న మాజీ సీఎం  కేసీఆర్ జిల్లాకు వస్తున్నారు.  కామారెడ్డిలో  సాయంత్రం జరిగే రోడ్డు షోలో ఆయన పాల్గొని కార్నర్​ మీటింగ్​లో మాట్లాడనున్నారు.  కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్ షెట్కార్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 9లేదా 10న వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తరఫున ఆ పార్టీ స్టేట్, జిల్లా నేతలు కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. 

దూకుడుగా కాంగ్రెస్‌ ​

కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి లీడర్లు, కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు.  గెలిస్తే తమ పార్టీ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు,  జుక్కల్​లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు గ్రామాల్లో బైక్​ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.   కామారెడ్డి టౌన్​పై షబ్బీర్​అలీ స్పెషల్​ఫోకస్​ పెట్టారు. అభ్యర్థి సురేశ్ షెట్కార్​కూడా జోరుగా పర్యటిస్తున్నారు.  

ప్రధాని సభతో బీజేపీలో జోష్ 

ఎంపీ సెగ్మెంట్‌లోని జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.   ఇతర పార్టీల కంటే ముందుగానే  ఇంటింటా ప్రచారం చేపట్టారు.  కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, జుక్కల్​లో మాజీ ఎమ్మెల్యే అరుణతార, బాన్సువాడలో  యెండెల లక్ష్మీనారాయణ,  ఎల్లారెడ్డిలో బాణాల లక్ష్మారెడ్డి,  పైడి ఎల్లారెడ్డిలు బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.  వీరితో పాటు ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆయా చోట్ల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.  జహీరాబాద్​ పరిధిలోని సంగారెడ్డి జిల్లాలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభతో బీజేపీలో  జోష్​ వచ్చింది.   ఇక్కడ ఏరియాల్లో  స్థానిక నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు,  అనుబంధ సంఘాలు, హిందుత్వ సంస్థల ప్రతినిధులు ఇంటింటా ప్రచారాన్ని చేస్తున్నారు.  

నేడు  కామారెడ్డిలో కేసీఆర్‌‌ రోడ్‌షో 

బీఆర్​ఎస్​ తరపున బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్​,  జాజాల సురేందర్, హన్మంతుషిండే తమ నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.  మీటింగ్​లు, రోడ్​ షోలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.   7న కామారెడ్డిలో  రోడ్​షోలో కేసీఆర్​ పాల్గొనున్నారు.