సిద్దిపేట రూరల్, వెలుగు: సీపీఎస్ ఉద్యోగుల పాలిట ఉరితాడుగా మారిందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, తెలంగాణ స్టేట్ సీపీఎస్ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు తెలిపారు. పాత పెన్షన్ సాధన కోసం టీఎస్ సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో ఈనెల16న జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో ప్రారంభం కానున్న పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర వాల్పోస్టర్ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) సాధించేందుకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర చేపట్టామన్నారు.
ఈనెల 27న సిద్దిపేటలో జరిగే సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ‘అభి నహి తో కబీ నహీ’ అన్న నినాదంతో ఆగస్టు12న పెద్ద ఎత్తున ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘాల లీడర్లు విక్రమ్ రెడ్డి, శశి కుమార్, విక్రమ్ రెడ్డి, వెంకటరాజం, రంగారావు, భూపాల్, యాదగిరి, సురేశ్ కుమార్, రవి, సతీష్, రాజిరెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీరామ్, సిద్ది వెంకటేశం పాల్గొన్నారు.
డీఎస్సీ–2003 టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలి
సంగారెడ్డి టౌన్ : ముందు నోటిఫికేషన్ఇచ్చి తర్వాత నియామకమైన డీఎస్సీ2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం లీడర్లు సోమశేఖర్, ప్రవీణ్, గోవర్ధన్ డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం అలసత్వంతో సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత ఉద్యోగంలో చేరడం కారణంగా సీపీఎస్ లోకి నెట్టబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం జారీ చేసిన మెమో 57ను రాష్ట్రంలోనూ అమలు చేస్తూ తమకు న్యాయం చేయాలన్నారు.