వరంగల్​ జిల్లాలో స్పీడ్​ పెంచిన నేతలు

  • అధికారిక ప్రొగ్రామ్స్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు
  • టికెట్ల కోసం ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్​ నాయకులు
  • కొనసాగుతున్న బీజేపీ నేతల పల్లె బాట

మహబూబాబాద్​, వెలుగు :  ఏ క్షణమైనా ఎలక్షన్​  నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉండడంతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని వివిధ పార్టీల నేతలు తమ కార్యక్రమాల్లో  వేగం పెంచారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వివిధ స్కీముల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం కాంగ్రెస్​ నేతలు హైదరాబాద్, ఢిల్లీలో గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ కన్ఫామ్​ అనుకున్న బీజేపీ నాయకులు గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అనుమానం ఉన్న బీజేపీ నేతలు హైదరాబాద్​లోనే మకాం వేశారు.

 స్పీడ్​ అందుకున్న  డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​ 

 మహబూబాబాద్​ ఎమ్మెల్యే బానోతు శంకర్​ నాయక్​, డోర్నకల్​ ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్​ ప్రతీ రోజూ రెండు, మూడు మండలాల పరిధిలో తిరుగుతూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం రూ.12 కోట్ల అంచనా  వ్యయంతో నిర్మించే తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, రూ.  2 కోట్లతో నిర్మించే  బంజారా భవన నిర్మాణ పనులకు  మంత్రి సత్యవతి రాథోడ్​,  ఎమ్మెల్యే  శంకర్​ నాయక్​, ఎమ్మెల్సీరవీందర్​ రావు శంకుస్థాపన చేశారు.  బీసీ బంధు పథకం కింద  కొత్తగూడ, గంగారం  లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను  అందించారు. డోర్నకల్​ నియోజక వర్గం పరిధిలో ఇటీవల  రూ.36 కోట్లతో నిర్మించే 100 పడకల హాస్పిటల్​కు, నర్సింహులపేట మండలంలో రూ.12 కోట్లతో నిర్మించే పనులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్​తో కలసి  ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. తొర్రూరు పట్టణంలో ఎస్​డీఎఫ్​ ఫండ్​ రూ.25 కోట్లతో చేపట్టే  పనులకు  4న పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుచే శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.23 కోట్లతో  చేసే తొర్రూరు,  హరిపిరాల రోడ్​ విస్తరణ , సెంట్రల్​ లైటింగ్​ పనులను  ప్రారంభించనున్నారు. 

హస్తిన బాటలో  కాంగ్రెస్​ నాయకులు

మహబూబాబాద్ టికెట్ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్​, డాక్టర్​ మురళీ నాయక్, ​బెల్లయ్య నాయక్​, డోర్నకల్​ అసెంబ్లీ   టికెట్​ ఆశిస్తున్న  డాక్టర్​ జాటోతు రామచంద్రు నాయక్​, మాలోతు నెహ్రు నాయక్​, కిసాన్​ పరివార్​ సంస్థ నిర్వాహకుడు భూపాల్​ నాయక్ టికెట్​ కోసం హైదరబాద్, ఢిల్లీకి తిరుగుతున్నారు. ఎమ్మెల్యే టికెట్​ ఖరారు అయితేనే ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్​ నాయకులు ఉన్నారు.

గ్రామాల్లో బీజేపీ నేతల ప్రచారం షురూ

మహబూబాబాద్​ అసెంబ్లీ పరిధిలో ఎమ్మెల్యే టికెట్​ ఆశిస్తున్న బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోతు హుస్సేన్​ నాయక్​ నియోజకవర్గంలో పల్లె పల్లెకు బీజేపీ ప్రొగ్రామ్​ నిర్వహిస్తున్నారు. డోర్నకల్​  నియోజకవర్గంలో బీజేపీ టికెట్​ను  నర్సింహులపేట జడ్పీటీసీ భూక్య సంగీత, గుగులోతు లక్ష్మణ్​ నాయక్​, బానోతు ప్రభాస్​నాయక్​ ఆశిస్తున్నా ఎటువంటి ప్రచారం చేపట్టడం లేదు.