
- సమస్యలు, స్కీమ్ లపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలదీస్తున్న జనం
- సీఎం నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి
మెదక్, సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న అధికార పార్టీ లీడర్లకు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. పార్టీ అభ్యర్థులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు మంజూరు కాకపోవడంపై మండిపడుతున్నారు.
ఇన్నాళ్లు మా ఊరికి రాలేదు.. సమస్యలు తీర్చలేదు.. మాకు ఏ స్కీమ్ మంజూరు చేయలేదు.. ఇప్పుడు ఎలక్షన్ రావడంతో ఓట్లకోసం మాత్రం వస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల మా ఊరికి రావొద్దని తేల్చి చెబుతున్నారు. ఇంకొన్నిచోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో తరచూ ఏదో ఒకచోట నిరసన పెల్లుబుకుతోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నగజ్వేల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మెదక్ జిల్లాలో..
బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డికి నిరసన సెగలు తగిలాయి. మెదక్ మండలం వెంకటాపూర్‌లో పార్టీ కార్యకర్తలతో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి సమావేశం ఏర్పాటు చేయగా దళితులు అక్కడికి వచ్చి దళిత బంధు వెంకటాపూర్ గ్రామానికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. పాపన్నపేట మండలం డాక్యా తండాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారానికి వెళ్లగా ఇంకుడు గుంతలు, టాయిలెట్స్ కట్టుకుంటే బిల్లులు రాలేదని నిరసన తెలిపారు.
మెదక్ మండలం పాతూరులో గృహలక్ష్మి మంజూరు కాలేదంటూ బైక్‌లు అడ్డుపెట్టి ప్రచారాన్నిఅడ్డుకునే ప్రయత్నం చేశారు. గంగాపూర్ లో దళిత బంధు మంజూరు కాలేదని అందువల్ల తమ కాలనీకి రావొద్దంటూ నిరసన తెలిపారు. హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లికి వెళ్లిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని పోడుపట్టాలు, పింఛన్లు, దళిత బంధు ఎందుకివ్వలేదని మహిళలు ప్రశ్నించారు.
నార్సింగి మండలం కశ్య తండాలో ప్రచారానికి వెళ్తుండగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన యువకులు, మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. బీఆర్ఎస్కు చెందిన చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. రామాయంపేట మండలం శివాయపల్లి గ్రామంలో పొడు భూములకు పట్టా పాస్ బుక్ లు రాకపోవడంతో పండిన పంట ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని గ్రామానికి చెందిన మహిళలు మండిపడ్డారు.
మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారంలో బీఆర్ఎస్ గజ్వేల్ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు జడ్పీ చైర్పర్సన్ హేమలత వెళ్లగా తమ భూములు లాక్కున్నారని, పింఛన్లు, సంక్షేమ పథకాలు నాయకులకు, అనుకూలంగా ఉన్న వారికే ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లీడర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోల్ సెగ్మెంట్ పరిధి టేక్మాల్ మండలం కాదులూర్ తండాలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రచారానికి వెళ్లగా తమకు తాగేందుకు నీళ్లు లేవు, మోరీలు లేక రోగాల బారిన పడుతున్నాం అయినా మమ్మల్నిఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. మా ఊరికి రావద్దు, మమ్మల్ని ఓట్లు అడగొద్దని ఖరాఖండిగాచెప్పారు.
సిద్దిపేట జిల్లాలో..
ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల బీఆర్ ఎస్ అభ్యర్థులకు నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని క్యాసారం గ్రామంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రచారానికి వెళ్లగా గ్రామంలోని దళితులు వారిని అడ్డుకున్నారు. దళిత బంధు ఇవ్వకుండా ప్రచారానికి ఎలా వచ్చారని నిలదీశారు.
బీ ఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కి నిరసన సెగలు తగులుతున్నాయి. మండలంలోని చిట్టాపూర్, దుంపలపల్లి గ్రామాల్లో ప్రచారాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని నిరసన వ్యక్తం చేసి అడ్డుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ, హుస్నాబాద్ మండలం గాంధీనగర్ కు ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసి అడ్డుకున్నారు.
గాంధీ నగర్ లో గ్రామస్తులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొమరవెల్లి మండలం తపస్సుపల్లిలో జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేదని పేర్కొంటూ ప్రత్యేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.