హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల విచారణకు అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను కూడా పిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు . ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిటీ తన పరిధి ని పెంచాలన్నారు. విద్యుత్ అంశంలో అవినీతి జరిగిందని ఆనాటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి , బీజేపీ నుంచి లక్ష్మణ్ మాట్లాడారని గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని పూర్తి ఆధారాలతోనే వారు అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని ఆయన వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కూడా అధికారులనే పిలిచి విచారణ చేస్తున్నారని, కానీ రాజకీయ నాయకులు కూడా పిలిచి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులు తమ తప్పులను సమర్థించుకోకుండా ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులను పిలిచి వారి దగ్గర ఆధారాలను తీసుకోవాలని ఆయన సూచించారు.