- ప్రజలను చైతన్యం చేయాలి: మహేశ్ గౌడ్
- ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అప్రతిష్టపాల్జేస్తున్నయ్
- కాంగ్రెస్ నేతలంతా తిప్పికొట్టాలని పీసీసీ చీఫ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వే చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అపోజిషన్ పార్టీల కుట్రలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ప్రకటనలో పిలుపునిచ్చారు.
‘‘గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ సర్వేకు సహకారం అందించాలి. కుల గణన గురించి ప్రజలకు వివరించి చైతన్యం చేయాలి. కుల గణన అనేది బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఆయా కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. కుల గణన దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజిక సంఘాల నేతలతో ఈ నెల 5న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు’’అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
సర్వేపై కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ఇంటింటికెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, సందేహాలుంటే నివృత్తి చేయాలని సూచించారు. అటు ప్రభుత్వానికి.. ఇటు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.