నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ లీడర్ల వారసులు పొలిటికల్ ఎంట్రీకి ఆరాటపడుతున్నారు. పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీకి కు సిద్ధంగా ఉన్నారు.
డి.శ్రీనివాస్కొడుకు సంజయ్..
రాష్ట్ర రాజకీయాల్లో డి.శ్రీనివాస్ పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేరు. శ్రీనివాస్ చిన్న కొడుకు ధర్మపురి అర్వింద్(బీజేపీ) నిజామాబాద్ఎంపీగా ఉన్నారు. శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద కొడుకు సంజయ్‌నగర మేయర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ మొదటి మేయర్‌గా సంజయ్ గుర్తింపు పొందారు. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
జగన్‌కోసం బాజిరెడ్డి రెడీ..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్3 దశాబ్దాలుగా పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. ఈయన ఆర్మూర్, బాన్సువాడ నియోజకర్గాల నుంచి ఒక్కోసారి, రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. మాజీ ఫైనాన్స్మినిస్టర్ శనిగరం సంతోష్‌రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్‌లో చేరిన బాజిరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. తన కొడుకు బాజిరెడ్డి జగన్‌ను అసెంబ్లీకి పంపాలనుకుంటున్నారు. కొడుకు కోసం ఓసీ జనరల్‌కు రిజర్వ్‌చేసిన జడ్పీ చైర్మన్ పదవిని ఆశించి ధర్పల్లి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయించి, గెలిపించారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ పదవి విఠల్‌రావుకు దక్కింది. లోకల్‌బాడీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్, అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. అధిష్టాన నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
అన్నపూర్ణమ్మ వారసుడిగా మల్లికార్జున్‌రెడ్డి..
బాల్కొండ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఏలేటి మహిపాల్‌రెడ్డి 80వ దశకంలో మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణంతో భార్య ఏలేటి అన్నపూర్ణ రాజకీయాల్లోకి వచ్చి, ఆర్మూర్‌నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పదేండ్ల కింద జరిగిన నియోజకవర్గాల బైఫరికేషన్ తర్వాత ఆర్మూర్‌లోని మండలాలు బాల్కొండలో కలిశాయి. బాల్కొండ నియోజకవర్గం నుంచి కొడుకు మల్లికార్జున్‌రెడ్డిని అసెంబ్లీకి పంపాలని ఆమె
ఆశిస్తున్నారు.
బాన్సువాడలో అన్నదమ్ముల మధ్య పోటీ
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన రవీందర్‌రెడ్డి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తిలేదు. రెండో కొడుకు సురేందర్‌రెడ్డి, మూడో కొడుకు భాస్కర్‌రెడ్డి తండ్రి వారసత్వాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ అయిదేండ్లుగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి భాస్కర్‌రెడ్డికి డీసీసీబీ చైర్లో కూర్చోబెట్టారు. సురేందర్‌రెడ్డికి లైన్‌క్లియర్ చేశారని అంతా భావించగా, ఇప్పుడు విషయం మళ్లీ మొదటికొచ్చింది. కొడుకులిద్దరూ తగ్గకుండా పోటీకి సై అనడం తండ్రికి తలనొప్పిగా మారింది. ఇంటెలిజెన్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి విషయం చేరడంతో ఈసారి పోచారం శ్రీనివాసరెడ్డినే బాన్సువాడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇద్దరు కొడుకుల్లో ఏకాభిప్రాయం వస్తే క్రియాశీల రాజకీయాలకు విరామం ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి యోచిస్తున్నారు.
తండ్రికి లభించని ఛాన్స్కొడుకుకి..
బాల్కొండ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డికి ఆర్మూర్‌నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనే బలమైన కోరిక ఉండేది. సురేందర్‌రెడ్డికి స్వయాన చెల్లెలు అయిన ఏలేటి అన్నపూర్ణమ్మ అక్కడ బలమైన నాయకురాలిగా చెలామణిలో ఉండడంతో సురేందర్‌రెడ్డి కల నెరవేరలేదు. తండ్రికి లభించని అవకాశాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పొందారు.