- వరుసగా మూడు ఎన్నికల్లో ఇదే పరిస్థితి
- అధిష్ఠానం తీరుపై కాంగ్రెస్ నాయకుల గుస్సా
మెదక్, వెలుగు : మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ కోసం కష్ట పడుతున్న వారికి టికెట్ దక్కడం లేదు. వరుసగా మూడు ఎన్నికల్లో ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసి వారికి టికెట్ రాకుండా, అనూహ్యంగా ఎన్నికల ముందు కొత్త అభ్యర్థులు వచ్చి టికెట్ ఎగరేసుకు పోతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కేటాయింపు విషయంలో అధిష్ఠానం తీరుపై మండి పడుతున్నారు.
2014లో విజయశాంతి..
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, రామాయంపేటకు చెందిన సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాత్ రావ్ ఆశించారు. ప్రధానంగా శశిధర్ రెడ్డి టికెట్ రేసులో ముందుండి పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి టీఆర్ఎస్ పార్టీ పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ విజయశాంతికి మెదక్ టికెట్ కేటాయించింది. దీంతో తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశించిన శశిధర్ రెడ్డికి మొండిచేయి చూపించారు.
ALSO READ: బీఆర్ఎస్ పార్టీకి బోర్డర్ సెగ్మెంట్ల టెన్షన్
ఈ సారి అదే పరిస్థితి..
గడచిన రెండు ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. కనీసం ఈ సారైనా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన స్థానిక నాయకులకు కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించగా పాత కథే పునరావృతం అయ్యేలా ఉంది. ఈ సారి 12 మంది నాయకులు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావ్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు.
అయితే ఇదివరకటి మాదిరిగానే వారెవరికీ కాదని తాజాగా పార్టీలో చేరిన మైనంపల్లి రోహిత్ కు టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మెదక్ టికెట్ విషయలో అధిష్ఠానం నుంచి స్పష్టమైన హమీ లభించిన తర్వాతే రోహిత్ కాంగ్రెస్‌లో చేరాడంటున్నారు. ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయితే వరుసగా మూడో సారి స్థానిక నాయకులకు కాంగ్రెస్ అధిష్ఠానం మొండిచేయి చూపినట్టవుతుంది. ప్రతి ఎన్నికల్లోనూ Wఇదే పరిస్థితి రిపీట్అవుతుండటంపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరును పార్టీ క్యాడర్ తప్పుబడుతోంది.
గత ఎన్నికల్లోనూ..
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 9 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్‌లు బట్టి జగపతి, చంద్రపాల్, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ నాయకులు తిరుపతిరెడ్డి, అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి, ద్వారకా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తమ్ముడు ఉపేందర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో సీనియర్ నేతలం, ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉన్నందున తమలో ఒకరికి ఛాన్స్ వస్తుందని శశిధర్‌రెడ్డి, జగపతి, చంద్రపాల్ ఆశించారు.
అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేసినందున తమకు అవకాశం వస్తుందని తిరుపతిరెడ్డి, సుప్రభాత్రావ్, బాలకృష్ణ ఆశించారు. కానీ అధిష్టానం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తమ్ముడు ఉపేందర్ రెడ్డికి బీ ఫాం ఇచ్చింది.