- ఒక్కో పనికి ఒక్కో రేటు.. బీరు, బిర్యానీ ఎక్స్ట్రా
- ఇంటింటి ప్రచారానికొస్తే రూ.200.. సభకు వస్తే రూ. 300
- 50 మందిని పట్టుకొస్తే 2 వేలు.. అన్ని పనులు నెత్తినేసుకుంటే 5వేలు
- పార్టీలో చేరే లోకల్ లీడర్లకు రూ. 5 లక్షల నుంచి 12 లక్షలు
- రిజర్వుడ్ స్థానాల్లో కన్నా జనరల్ సీట్లలోనే ఎక్కువ డిమాండ్
హైదరాబాద్/వరంగల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడటం లేదు. తమ బలం, బలగం చూపించుకునేందుకు కూలీ చెల్లించి మరీ జనాన్ని తమ వెంట తిప్పుకుంటున్నారు. ప్రత్యర్థి ప్రచారంలోకన్నా తమ ప్రచారంలో ఎక్కువ మంది కనిపిస్తే నాలుగు ఓట్లు రాలుతాయని భావిస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి వస్తే ఒక రేటు.. పెద్ద నాయకుల మీటింగ్కు వస్తే ఇంకో రేటు.. 50 మందిని తీసుకొని వస్తే మరో రేటు.. ఇట్ల లెక్క గట్టి మరీ జనాన్ని రప్పించుకుంటున్నారు.
ఎక్స్ట్రాగా బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తున్నారు. లేబర్ పని కన్నా, ఉపాధి హామీ పని కన్నా.. ఎన్నికల కైకిలికి పోతే నాలుగు పైసలు ఎక్కువగా వస్తుండటంతో జనం కూడా ఓకే చెప్తున్నారు. చాలా చోట్ల లీడర్ల ప్రచారంలో సామాన్య జనం కన్నా.. వారి వెంట వచ్చే రోజువారీ కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇందులో జెండాలు మోసేవాళ్లు కొందరుంటే.. జై కొట్టే వాళ్లు, సీటీలు కొట్టేవాళ్లు ఇంకొందరు ఉంటున్నారు. ఇక, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులైతే ఇదే మోఖాగా భావించి.. ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడికి జంప్ అవుతున్నారు. రోజుల వ్యవధిలోనే కండువాలు మార్చేస్తున్నారు. వారికి అభ్యర్థులు ప్రత్యేకంగా రేట్లు ఫిక్స్ చేసి.. ముందస్తుగా చెల్లింపులు కానిచ్చేస్తున్నారు.
పోటీని బట్టి రేటు
అభ్యర్థుల నడుమ ఉన్న పోటీని బట్టి ఎన్నికల కైకిలికి ఒక్కో నియోజవర్గంలో ఒక్కో రేటు నడుస్తున్నది. ప్రచారానికి డైలీ వచ్చే ఒక్కో వ్యక్తికి సగటున రూ.200 ఇస్తున్నారు. చేతిలో బతుకమ్మతో వస్తే రూ.300 చెల్లిస్తున్నారు. పెద్ద నాయకుల సభలు, ర్యాలీలకు వస్తే రూ.300తో పాటు బీరు లేదంటే కోటర్ సీసా, బిర్యానీ ఇస్తున్నారు.
ప్రచారానికి 50 నుంచి 100 మందిని పట్టుకొచ్చే టీమ్ ఇన్చార్జ్కైతే రోజుకు రూ. 2 వేల దాకా ముట్టజెప్తున్నారు. అన్ని పనులు నెత్తినేసుకుని ప్రచారం నిర్వహించే లోకల్ లీడర్‍కు డైలీ రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎన్నికల కైకిలి రేట్లు తక్కువగా ఉండగా.. పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ సీట్లలో మాత్రం ఎక్కువగా ఉంది. జనరల్ కోటా స్థానాల్లో చాలా మంది కోటీశ్వరులు, వ్యాపారులు, రియల్టర్లు పోటీలో ఉన్నారు. వీరిలో అనేక మంది రోజు ప్రచారానికే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి లిక్కర్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడ్తున్నారు. కొందరు క్యాండిడేట్లు రోజూ ఉదయం గ్రామాల్లోని తమ లోకల్లీడర్లకు రూ.50 వేల నుంచి లక్ష దాకా ఇచ్చి.. ప్రచారానికి జనాన్ని రప్పించుకుంటున్నారు. ప్రచార పనికి వచ్చే జనాలకు కూలీ ఇవ్వడం, వారికి భోజనాలు పెట్టించడం, వాహనాల కిరాయిలు, సాయంత్రం లిక్కర్ దావత్ వంటివన్నీ ఈ డబ్బులతో లోకల్ లీడర్లు మేనేజ్ చేస్తున్నారు.
కండువా మారిస్తే.. స్పెషల్ ప్రైజ్!
లోకల్ లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో కూడా చాలా మంది ఈ ఎన్నికలను తమకు ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే, వారి జెండా
కప్పుకునేందుకు సిద్ధంగా ఉంటున్నారు. దీంతో తమ పార్టీ లీడర్లను కాపాడుకోవడం కోసం, ఇతర పార్టీల నుంచి లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవడం కోసం ఎమ్మెల్యే క్యాండిడేట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. 500 నుంచి 700 ఓట్లు ఉండే చిన్న గ్రామాల సర్పంచులు తమ పార్టీలో చేరితే రూ. 5 లక్షలు.. పెద్ద జీపీ సర్పంచ్లైతే రూ.10 లక్షల దాకా చెల్లిస్తున్నారు.
ఎంపీపీ, జడ్పీటీసీ మెంబర్ కండువా కప్పుకుంటే డిమాండ్ ఆధారంగా రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా చెల్లిస్తున్నారు. టికెట్ ఆశించి రానివాళ్లలో 5 వేలకు పైగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న లీడర్లు కొందరు ఎన్నికల్లో తమ నామినేషన్ విత్ డ్రా చేసుకోడానికి రూ.కోటి వరకు డిమాండ్ చేయగా.. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండే రెబల్ లీడర్లు రూ. 5 కోట్లు దాకా డిమాండ్ చేసినట్లు చర్చ జరుగుతున్నది.
వారితో నామినేషన్ విత్డ్రా చేయించడానికి వారు అడిగినంత డబ్బులను కొన్ని పార్టీలు చెల్లించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక, నియోజకవర్గాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉంటే.. ఆ సామాజికవర్గానికి చెందిన లీడర్లు తమ రేట్ ఎంతో క్యాండిడేట్ల ముందు పెడ్తున్నారు. వారి ఓట్ల కోసం అభ్యర్థులు ఆ మొత్తం చెల్లిస్తున్నారు. ఇదంతా మూడో కంటికి కనిపించకుండా జరిగిపోతున్నది.
హుజూరాబాద్, మునుగోడు బై పోల్స్ ఎఫెక్ట్
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఎఫెక్ట్ పడింది. ఇదే విషయాన్ని అభ్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారు. పార్టీ కండువా కప్పుకునే లీడర్లను లక్షల రూపాయలు పెట్టి కొనే కల్చర్ ఆ ఉప ఎన్నికల నుంచే వచ్చిందని, దేశంలోనే కాస్ట్లీ ఎన్నికలంటే తెలంగాణ ఎలక్షన్స్ అనే భావన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతోనే దేశమంతా పాకిందని అంటున్నారు. జనం కూడా డబ్బులు ఆశిస్తున్నారని, ఇవ్వకపోతే నిలదీసిన సంఘటనలు హుజూరాబాద్ బైపోల్ టైమ్లో చూశామని గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, ప్రత్యర్థికి తమ బలం చూపెట్టుకునేందుకైనా ఖర్చు చేయకతప్పడం లేదని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. గతంలో ఓటుకు రూ.500 ఇచ్చే స్థానాల్లోనూ హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల తర్వాత తక్కువలో తక్కువ రూ.2 వేల నుంచి 3 వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని లీడర్లు అంటున్నారు. దీనికితోడు గతంలో ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు లిక్కర్ వంటి ప్రలోభాలు ఉండగా.. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైనరోజు నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నారు.
ఓటర్లకు పైసల పంపిణీకి ఇన్చార్జులు రెడీ
ఓట్లు వేసేందుకు మరో 10 రోజుల సమయం ఉండగా.. కొన్ని రాజకీయ పార్టీలు కులాలు, ఏరియాల వారీగా ఓటర్లకు ఎంత చెల్లించాలనేది ముందుగానే ఫిక్స్ చేసి పెట్టుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.1,000 నుంచి 2 వేల దాకా చెల్లించేందుకు.. జనరల్ స్థానాల్లో రూ. 2వేల నుంచి 4వేల దాకా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆ డబ్బులను ఓటర్లకు చేర్చేలా ఇన్చార్జులను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇన్చార్జ్ ఉండేలా కొన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఓటర్ల జాబితా ఆ ఇన్చార్జులకు ఇచ్చి.. ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందు వారి చేతికి డబ్బులు అందగానే పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నాయి.