వాళ్లు ఓటేసుకోలేరు: లోక్ సభ ఎన్నికల్లో చిత్రం

వాళ్లు ఓటేసుకోలేరు: లోక్ సభ ఎన్నికల్లో చిత్రం

ఆ నేతలు ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని చెమటోడ్చుకుంట ప్రచారం చేస్తున్నారు. పల్లెపల్లెన తిరుగుతున్నరు. తనకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కానీ చాలా మంది అభ్యర్థులు తాము పోటీచేస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో ఓటేసుకోలేని పరిస్థితి. ప్రధాన పార్టీల్లో సగం మందికి పైగా అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న సెగ్మెంట్‌ లోఓటు లేదు. వారికి ఓటు ఒకచోట ఉండగా..వారు మరో సెగ్మెంట్​లో పోటీ చేస్తున్నారు.అభ్యర్థుల అఫిడవిట్లలో ఈ వివరాలున్నాయి.ఈ లిస్టులో ప్రధానంగా రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డివెంకట్‌ రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రాంచందర్‌ రావు, జనార్దన్‌ రెడ్డి, మల్లు రవి, బూర నర్సయ్య గౌడ్‌ , అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. మరోవిశేషం ఏమిటంటే ఎంపీ అభ్యర్థులు చాలామందికి సికింద్రాబాద్‌ లోక్‌‌‌‌సభ పరిధిలో ఓటుహక్కు ఉంది. అందులో చేవెళ్ల నుంచి పోటీలో ఉన్నవారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురికీ సికింద్రాబాద్‌ లోనే ఓటు ఉంది.

బీజేపీ నుంచి..
బీజేపీ నుంచి బరిలో ఉన్న పలువురు అభ్యర్థులకు కూడా వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఓట్లు లేవు. నాగర్ కర్నూల్ అభ్యర్థి బంగారు శృతి, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్న ఎన్. రాంచందర్ రావు, చేవెళ్లనుంచి పోటీ చేస్తున్న జనార్దన్ రెడ్డిల ఓట్లు సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి బరిలో ఉన్న డీకే అరుణ ఓటు నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో ఉంది. నల్లగొండ నుంచి పోటీ చేస్తున్న గార్లపాటి జితేంద్రకుమార్ ఓటు హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఉంది. వరంగల్ నుంచి బరిలోఉన్న సాంబమూర్తికి ఓటు నల్లగొండలో ఉంది. ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీకి ఓటు చేవెళ్ల లోక్ సభ పరిధిలో ఉంది.

కాంగ్రెస్‌‌‌‌ నుంచి..
మల్కాజ్ గిరి లోక్ సభ సెగ్మెంట్​ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు నాగర్‌ కర్నూల్‌ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు ఉంది. భువనగిరి నుంచి బరిలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి నల్లగొండ సెగ్మెంట్​లో ఓటుహక్కు ఉంది. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలో ఉన్నచంద్రశేఖర్‌ కు చేవెళ్ల పరిధిలో ఓటుంది. సికింద్రాబాద్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నఅంజన్‌ కుమార్‌ యాదవ్‌ కు హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. హైదరాబాద్ లోక్ సభకు పోటీ చేస్తున్న ఫిరోజ్‌‌‌‌ ఖాన్‌ ఓటు సికింద్రాబాద్‌ పరిధిలో ఉంది. చేవెళ్ల నుంచి బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి, నాగర్‌ కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్నమల్లు రవి, జహీరాబాద్‌ నుంచి పోటీలో ఉన్న మదన్‌ మోహన్‌ లకు సికింద్రాబాద్​లోనే ఓటుఉంది. మహబూబ్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తున్న వంశీచంద్‌ రెడ్డికి నాగర్‌ కర్నూల్‌ పరిధిలోఓటు హక్కుంది.

టీఆర్ఎస్ నుంచి వీరే..
ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచిఎక్కువ శాతం కొత్తవారు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ లో పోటీచేస్తున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ కు మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో.. నల్లగొండ నుంచి బరిలోఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డికి సికింద్రాబాద్ పరిధిలో ఓటు హక్కుఉంది. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ , చేవెళ్ల నుంచి పోటీలో ఉన్నరంజిత్ రెడ్డిలకూ సికింద్రాబాద్ సెగ్మెంట్ లోనే ఓటు ఉంది.