- అభ్యర్థులు మారి, టికెట్టు తమకే వస్తుందని ధీమా
- ఆశీర్వాద యాత్ర రీస్టార్ట్ చేసిన కందుల సంధ్యారాణి
- పరామర్శలు మొదలు పెట్టిన చల్లా నారాయణరెడ్డి
- బీసీలను ఏకం చేసే పనిలో బొద్దుల లక్ష్మన్
పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్టు సిట్టింగ్ లకే కేటాయించడంతో... ఆశావహులు నిరాశకు గురయ్యారు. కొంత మంది పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొంతమంది మాత్రం టికెట్టు వచ్చేది తమకే అంటూ ఆశలు వదులుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాలను, వారి ప్రచార కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. టికెట్టు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చందర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జడ్పీటీసీ కందుల సంధ్యారాణీ ఏడాది కాలంగా ప్రజా ఆశీర్వాద యాత్ర చేశారు. మళ్లీ టికెట్టు చందర్‌కే వచ్చినా.. సంధ్యారాణి టికెట్టుపై ఆశలు వదులుకోలేదు. ప్రజా ఆశీర్వాదయాత్ర రీస్టార్ట్ చేసి టిక్కెట్ తనకే అనేలా క్యాడర్‌కు సంకేతాలిస్తున్నారు.
అలాగే మంథనిలో టిక్కెట్ ఆశించిన చల్లా నారాయణరెడ్డి.. పుట్ట మధుకే టిక్కెట్ ఇవ్వడంతో నెల రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రజల్లో తిరుగుతూ టిక్కెట్ తనకే వస్తుందని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీ నినాదం తెర మీదికి వస్తుంది. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ టిక్కెట్ ఇవ్వడంతో, టిక్కెట్ ఆశించినజూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అనుచరులు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి లక్ష్మన్కే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పెద్దపల్లి సీటు బీసీలకే ఇవ్వాలని అన్ని పార్టీల నాయకులు ఆయా హైకమాండ్లను డిమాండ్ చేస్తున్నారు.
ఈక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పునరాలోంచి తనకే టిక్కెట్ ఇవ్వాలని లక్ష్మన్ హైకమాండ్‌ను కోరుతున్నారు. ఒకవైపు హైకమాండ్ టిక్కెట్లు కన్ఫామ్ చేసినప్పటికీ, అసమ్మతి నేతలు మాత్రం అభ్యర్థులపై తీవ్ర ఆరోపనలు చేస్తున్నారు, అయినా హైకమాండ్ వారిని కంట్రోల్ చేయడం లేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు సిట్టింగులకు సీట్లు ఇచ్చినా అభ్యర్థులను మార్చే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, ఆయా నియోజకవర్గాల్లో లీడర్లు అంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆశావహులు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులు. ఈ క్రమంలో గత నెల రోజులుగా సైలెంట్‌గాఉన్న రెబల్స్ కేటీఆర్ విదేశాలనుంచి వచ్చిన వెంటనే తమ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. మంథని టిక్కెట్ ఆశిస్తున్న చల్లా నారాయణరెడ్డి తిరిగి నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన జడ్పీటీసీ బొద్దుల లక్ష్మన్ తన అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి, తనకే టిక్కెట్ ఇచ్చేలా డిమాండ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.