సెకండ్​ లిస్ట్​ కోసం లీడర్ల వెయిటింగ్​

సెకండ్​ లిస్ట్​ కోసం లీడర్ల వెయిటింగ్​
  • ఊపందుకోని క్షేత్ర స్ధాయి ప్రచారాలు
  • పలు పార్టీల క్యాడర్లలోఅయోమయం
  • టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు

సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నగారా మోగి నామినేషన్ల ఘట్టం దగ్గరపడుతున్నా జిల్లాలో  ప్రచారాలు ఊపందుకోలేదు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ దుబ్బాక, గజ్వేల్​లో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయగా.. కాంగ్రెస్​కేవలం మెదక్​లో మాత్రమే అభ్యర్థిని ప్రకటించి మిగతా స్థానాలను పెండింగ్​ పెట్టింది. దీంతో టికెట్లు కన్ఫర్మ్​ కాని స్థానాల్లో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పొత్తుల కారణంగా హుస్నాబాద్ సీటు పై సస్పెన్స్ కొనసాగుతుండగా.. గజ్వేల్, సిద్దిపేట స్థానాల్లో  కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలోకి  దింపాలనే ఆలోచనలో ఉండడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఏకగ్రీవ తీర్మానాలపై నజర్

సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏకగ్రీవ తీర్మానాలు, చేరికలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి హరీశ్​ రావు ఇప్పటికే పలుమార్లు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు.  ఇందులో భాగంగా పలు కుల సంఘాలు, గ్రామాల ప్రజలు హరీశ్ రావుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను పార్టీ హైమాండ్​ అప్పగించడం వల్ల స్థానిక నేతలే ముందుండి ప్రచారం కొనసాగించాలని హరీశ్​ రావు స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు. 

రెండు పార్టీల్లో ఆశావహులు అధికం

సిద్దిపేట అసెంబ్లీ టికెట్​రేసులో కాంగ్రెస్, బీజేపీ నుంచి చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 15 మంది, బీజేపీ నుంచి  21 మంది టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయిని నరోత్తం రెడ్డి, విద్యాసాగర్, భైరి శంకర్ ముదిరాజ్, ఉడుత మల్లేశం యాదవ్, టీ.వెంకటేశం, పత్రి  శ్రీనివాస్, కొత్తపల్లి వేణుగోపాల్ లతో పాటు మరో 14 మంది అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి తాడూరి   శ్రీనివాస గౌడ్, దర్పల్లి చంద్రం, పూజల హరికృష్ణ, భవాని రెడ్డి , కిరణ్ కుమార్, రఘువర్థన్ రెడ్డి, సూర్యచంద్ర వర్మ,  బి.యాదగిరి, గంప మహేందర్ రావు, మహ్మద్ ఖలీమొద్దీన్, దేవుల పల్లి యాదగిరి

ALSO READ : అపార్ట్‌మెంట్‌లో మంటలు.. కాలిబూడిదైన ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్
 

జి.శ్రీనివాస్, మీసం నాగరాజు, మార్క సతీశ్​ కుమార్, శ్రీనివాస ముదిరాజ్ అప్లై చేసుకున్నారు. ఇందులో బీసీలు ఎక్కువగా ఉండడంతో సిద్దిపేట లో కాంగ్రెస్ టికెట్​ బీసీలకే కన్ఫర్మ్​ అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇదిలా వుంటే టికెట్ ఆశావహులు ఒకరిద్దరు క్షేత్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మిగిలిన వారు టికెట్ లభిస్తే చూద్దాం లే అన్న ధోరణితో ఉన్నారు. 

దుబ్బాకలో పోలిటికల్ హీట్

దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజీపీ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకోవడంతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం గ్రామాల్లో ప్రచారం కంప్లీట్​ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి ఇటీవలే ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు పార్టీల అభ్యర్థులు చేరికలపై దృష్టి సారించి కార్యకర్తలను క్రియా శీలకం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఇప్పటికే బూత్ స్థాయి ఏజెంట్లు, శక్తి కేంద్రాల ఇన్​చార్జీలతో సమావేశాన్ని నిర్వహించి  ప్రచారాల దిశా నిర్దేశం చేయగా బీఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాక రెడ్డి సోషల్ మీడియా ఇన్​చార్జీలతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. 

ఆ రెండు చోట్లా అంతంత మాత్రమే

జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్​లో  ద్వితీయ శ్రేణి నాయకులు చేరికలు, ఏకగ్రీవ తీర్మానాలపై దృష్టి పెట్టారు. బీజీపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్​ పోటీ చేస్తుండటంతో కొంత మేర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లయింది. కాంగ్రెస్  అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి ఇటీవల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశమై ప్రచారాలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. 

హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీశ్​కుమార్ ప్రచారాన్ని ప్రారంభించి గ్రామాలను చుట్టేస్తుండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంత వరకు ఖరారు కాలేదు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్​రెడ్డి, బీజేపీ ఆశావహులు శ్రీరాం చక్రవర్తి, జన్నపు రెడ్డి సురేందర్​ రెడ్డి ప్రచారాలు కొనసాగిస్తుండటం గమనార్హం.