మూడోసారి కూడా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రిగా నియామకం అవుతారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ పద్మా నగర్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోలు బంకును మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ప్రారంభమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీలి రావు, టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్ రావు పాల్గొన్నారు. ఫ్లెక్సీపై తన 22 ఏళ్ల క్రితం నాటి ఫొటో పెట్టారని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలసీలకు భిన్నంగా ఏం చేస్తారో చెప్పకుండా పాదయాత్రల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్న మంత్రి... వీళ్లంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిన వ్యక్తులు, పార్టీలేనని ఆరోపించారు. కేసీఆర్ కంటే గొప్ప పాలకుడు వీరిలో ఎవరూ ప్రజలకు కన్పించడం లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లకు ఇది అర్థం కాదని విమర్శించారు. చేతకాని నేతలు సభలు, పాదయాత్రలు చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్లకు అది అర్థం కాదన్న ఆయన.. కేసీఆర్ కు, మిగతా నేతలకు మధ్య ఉన్న విభజన రేఖను ప్రజలు గమనిస్తురన్నారు. ఉద్యమంలో పనిచేసినోళ్లకే తెలంగాణ ఆర్థ్రత, బాధలు తెలుస్తాయని చెప్పారు. మార్క్ ఫెడ్ ఆస్తులను పెంచుకునేందుకు ఇలాంటి పెట్రోలు బంకు ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి అన్నారు.
ప్రభుత్వశాఖల అధికారులు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ను వినియోగించుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు. యాసంగి సాగులో ఆల్ టైం రికార్డు సాధించామన్న ఆయన.. 2014లో 28 లక్షల ఎకరాల సాగు ఉంటే ఈసారి 68 లక్షల పైగా యాసంగి సాగు జరిగిందని కొనియాడారు. వ్యవసాయ వృద్ధి రేటులో మనం దేశంలో నెంబర్ వన్ గా ఉందని, సీఎం విధానాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధి సాధిస్తే మిగతా రంగాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని పిలుపునిచ్చారు. వ్యవసాయం పెరగడం వల్లే సహకార రంగం బలోపేతమైందన్న మంత్రి నిరంజన్ రెడ్డి... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటి నుంచి రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. మనకంటే పెద్ద రాష్ట్రాల్లో ఇందులో పావు శాతం కూడా వ్యవసాయానికి ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని తెలియజేశారు.