నామినేటెడ్ పోస్ట్​లపై ఆశలు .. ప్రొటోకాల్ కోసం లీడర్ల తాపత్రయం

  • ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన లీడర్ల ఎదురుచూపులు
  • జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ కాంగ్రెస్​ నేతల ప్రదక్షిణలు
  • సుడా చైర్మన్, మార్కెట్ కమిటీలకు ఫుల్ డిమాండ్ 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడంతో.. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్న లీడర్లు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ విధానాలపై ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన తమకు జిల్లా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో చైర్మన్, డైరెక్టర్ పోస్టులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవి దక్కించుకుంటే ప్రొటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు  హాజరుకావొచ్చనే అభిప్రాయంతో  లీడర్లు ఉన్నారు. 

ఈ మేరకు తమకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రధానంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్(సుడా) పదవితోపాటు జమ్మికుంట, కరీంనగర్, హుజూరాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులకు ఆయా నియోజకవర్గాల్లోని  కాంగ్రెస్ సీనియర్లు పోటీపడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పలువురు రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్నారు. జిల్లాలో 41 నామినేటెడ్ పోస్టులకు వందల సంఖ్యలో లీడర్లు పోటీపడుతున్నారు. 

ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటేనే పదవి.. 

జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులకు లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రుల రెకమండేషన్ తప్పనిసరిగా మారినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు లీడర్లు జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకమైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు హుజూరాబాద్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వొడితల ప్రణవ్ కు ఆయా నియోజకవర్గాలకు చెందిన సెకండరీ క్యాడర్​ లీడర్లు తమ బయోడేటాలు ఇచ్చినట్లు తెలిసింది. వీరంతా తాము ఆశిస్తున్న చైర్మన్, డైరెక్టర్ పోస్టుల గురించి వారి దృష్టికి తీసికెళ్లినట్లు సమాచారం. 

మార్కెట్ కమిటీలకు ఫుల్ డిమాండ్..

జిల్లాలో 7 ప్రధాన మార్కెట్లు, 3 సబ్ మార్కెట్లు ఉన్నాయి. కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, మానకొండూర్, గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కమలాపూర్, కేశవపట్నం, ఎల్కతుర్తిలోని సబ్ మార్కెట్ల కమిటీ పాలకవర్గాల్లో చోటు కోసం డిమాండ్ ఉంది. గత సర్కార్ హయాంలో రిజర్వేషన్ ప్రాతిపదికన చైర్మన్ పదవులు దక్కాయి. ఇందులో సగం పదవులు మహిళలకే కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని పాటిస్తుందా లేదా పాత పద్ధతిలో కమిటీలను నియమిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. గత ప్రభుత్వంలో కొత్తగా తీసుకొచ్చిన రైతుబంధు సమితులను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా.. రద్దు చేస్తుందా అనే విషయంలోనూ స్పష్టత లేదు. ఒక వేళ వాటిని మరో పేరుతో కొనసాగించినా మండల, జిల్లా స్థాయిలో మరికొందరికి అవకాశం దక్కనుంది. 

ఆలయ కమిటీలపైనా ఆసక్తి.. 

ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణాలు, పండుగల సందర్భాల్లో ఆలయ కమిటీల పాత్ర కీలకం. దీంతో ఈ పదవులపైనా కాంగ్రెస్ లోకల్ లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామాలయం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీలకు బీఆర్ఎస్ హయాంలోనూ పాలకవర్గాలను నియమించలేదు. 

ఈ ఆలయాలకు ఏటా రూ.30 లక్షల మేర ఆదాయం వస్తుంది. వీటికి ఆలయ పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. అలాగే కరీంనగర్ లోని విజయగణపతి సాయిబాబా,  గౌరీశంకర, భక్తాంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి(మంకమ్మతోట), పొద్దుటూరి వారి ధర్మసంస్థ, హరిహర, గిద్దెపెరుమాండ్ల స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ నగర్ ప్రసన్నాంజనేయ ఆలయం, కోతిరాంపూర్ పోచమ్మ,  కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి, జమ్మికుంట వేంకటేశ్వర స్వామి, హుజూరాబాద్ హనుమాన్ ఆలయం, తిమ్మాపూర్ మండలం నల్గొండలోని సీతారామస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కోతిరాంపూర్ పోచమ్మ, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ, వేంకటేశ్వరస్వామి(జమ్మికుంట) ఆలయాలకు దేవస్థాన కమిటీల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం స్థానిక నాయకులు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

పదవుల్లో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాకు పార్టీ హైకమాండ్​ సముచిత స్థానం కల్పించింది. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు మంత్రి పదవులు దక్కగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విప్ పదవులు వరించాయి. అలాగే హుజూరాబాద్ టికెట్ త్యాగం చేసిన ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. 

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అజ్మతుల్లా హుస్సేన్ నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన హర్కార వేణుగోపాల్ ప్రొటోకాల్ విభాగం ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. వీటితోపాటు మరికొన్ని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు.