సౌకర్యాలు కల్పించే నాయకులే ఓట్ల కోసం రావాలె : ప్రజలు

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉపఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో మునుగోడు  నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని కాశవారి గూడెంలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మీ డబ్బులు మాకొద్దు రోడ్డు వేయండి ఓట్లు వేసి గెలిపిస్తామంటూ గ్రామస్థులు ఏర్పాటు చేసిన బ్యానర్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. 30 ఏండ్లుగా ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రామం ఏ మాత్రం ప్రగతి సాధించలేదని, గత 30 ఏండ్లుగా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మారినా తమ గతుకుల రోడ్డు మాత్రం మారలేదని వాపోయారు. అన్ని సౌకర్యాలు కల్పించే నాయకులు మాత్రమే ఓట్ల కోసం కాషవారిగూడెంకి రావాలని కోరారు. తక్షణమే కల్వలపల్లి నుంచి కాషవారిగూడెంకు రోడ్డు, గ్రామ పంచాయితి నిర్మాణం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు విన్నపించారు.