విశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి

రాజకీయం–నేరం కలగలిసి కాపురం చేస్తున్న సమయం ఇది. ప్రజాప్రతినిధుల పేరుతో, రాజకీయ పార్టీల్లో తమకున్న పదవుల పేరుతో నీతిమాలిన చర్యలకు, దందాలకు పాల్పడుతున్నవారు ఎందరో ఉన్నారు. పేరుకు ప్రజావిశ్వాసం పొందుతున్నా.. అన్ని పనులూ ప్రజలకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. అధికారం ఆలంబనగా వీరు సాగిస్తున్న అరాచకాలకు అంతే ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే అరాచకాలకు పాల్పడుతుంటే.. మరికొన్నిచోట్ల వారి కుటుంబ సభ్యులు లేదా అనుచరులు పెత్తనాలు సాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కన్నుపడ్డ ఆస్తి అయినా, ఆడదైనా వారి పరం కావలసిందే. లేదంటే సహించే పరిస్థితి లేదు. మధ్యవర్తిత్వం పేరుతో వీరు సాగిస్తున్న అరాచకాలు శృతిమించి కొందరి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రాజకీయ సంబంధమైన ఇలాంటి చీకటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో జనం నేర రాజకీయాలను నియంత్రించలేమా? నిజాయితీతో కూడిన రాజకీయాలను చూడలేమా? అని ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే రాజకీయాల నుంచి నేర చరితులను దూరం పెట్టాలి. దోషులుగా తేలిన వారిని రాజకీయాల నుంచి శాశ్వతంగా వెలివేయాలి. చట్టాలను కఠినతరం చేసి.. సత్వర న్యాయాన్ని అందించినప్పుడే రాజకీయాల్లో మార్పు చూడగలం.

అధికార జోక్యానికి పాల్వంచ ఘటనే ఉదాహరణ

డబ్బు ఖర్చుచేసి గెలవడం.. అంతకు పది రెట్లు అడ్డదారిన సంపాదించుకోవడంతోపాటు పశువుల్లా మారి సాయం కోసం వచ్చిన మహిళల మానప్రాణాలను దోచుకోవడం జాడ్యంగా మారింది. పదవి ఉండి అధికారం తోడైతే చాలు ఏదైనా చేయవచ్చనే భావన పెరగడం ఆందోళన కలిగించడంతోపాటు పార్టీల మార్పిడికీ కారణమవుతోంది. రాజకీయాల్లో ధన ప్రభావం ఉన్నంత కాలం, ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించలేనంతకాలం ఇటువంటి వ్యక్తులను రాజకీయాల నుంచి వేరు చేయడం అంత తేలికకాదు. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన ఘటన శృతిమించిన అధికార జోక్యానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో కొనసాగితే తమ పెత్తనం నడవదని గెలిచిన రెండు నెలలకే పార్టీ మారిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. అధికారం అండతో ఈ మూడేండ్లలో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనేక దారుణాలకు ఒడిగట్టాడు. 12 కేసులకు సంబంధించి ఆరోపణలు ఉంటే రెండు కేసుల్లోనే పోలీసులు అతడిపై చార్జిషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసి మిగతా కేసుల గురించి పట్టించుకోలేదంటే రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాధితుడు నాగరామకృష్ణ సెల్ఫీ వీడియో బయటపడిన తర్వాత ప్రజా ఆగ్రహం పెల్లుబికడంతో తప్పనిసరై అధికార యంత్రాంగం స్పందించిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. 

నిర్భయ చట్టాన్ని ఎందుకు పెట్టలేదు

దిశ లాంటి అమానుష ఘటనలో నలుగురిని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కొత్తగూడెంలో రాఘవ అరాచకం ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. నియోజకవర్గవ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అతడి బారిన పడి ఆత్మహత్య చేసుకున్నవారు కొందరైతే, సర్వం పోగొట్టుకుని జీవచ్చవాలుగా బతుకున్నారు ఇంకొందరు. ఒక యువతి మానప్రాణాలు బలిగొన్న చదువూసంధ్యాలేని నలుగురు వ్యక్తులను ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్రజల సత్కారాలు అందుకున్న పోలీసులు.. ఎందరివో మానప్రాణాలను, ఆస్తులను దోచుకున్నా పెద్ద మనిషిలా, అధికార పార్టీ ముసుగులో తిరుగుతున్న ఈ మానవ మృగాన్ని ఏం చేయాలి. పాల్వంచ ఘటనలో నలుగురు ప్రాణాలను బలిదీసుకున్న రాఘవపై సాధారణ క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్ల కిందనే కేసు పెట్టారు. ఈ కేసు ఏండ్ల తరబడి నడిచి.. చివరికి ఏ శిక్షా లేకుండా విడుదలై రొమ్ము విరుచుకొని బజారులో తిరిగే రాఘవలాంటి మానవ మృగాన్ని శిక్షించడానికి కనీసం నిర్భయ చట్టాన్ని ఎందుకు ఉపయోగించలేదో  ఈ పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, బాధలు, ఇబ్బందులతో శరణుకోరితే ఆస్తులను, మానప్రాణాలను కోరుకుంటున్న వీరికి ఎలాంటి శిక్ష వేయాలన్నది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. 

న్యాయ వ్యవస్థను సమీక్షించాలి

అన్నింటికీ మించి రాజకీయం సేవ అన్న విషయాన్ని ఇప్పటి తరం మరిచిపోతున్నది. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారంతా సేవా భావంతోనే రాజకీయాలు నడిపారు. తమ ఆస్తులను హారతి కర్పూరంలా కరిగించుకున్నారు తప్ప.. పరుల ఆస్తిపై ఏనాడూ కన్నేయలేదు. రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడంతోపాటు చట్టాలను పకడ్బందీగా రూపొందించడం ద్వారా  నేర రాజకీయాలను నియంత్రించ వచ్చు. ఆర్థిక, లైంగిక అరాచకాలకు పాల్పడినప్పుడు అలాంటి వారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేసే చట్టం తీసుకురావలసి ఉంది. రాజకీయాల్లో ఉండి నేరాలు మోపబడినప్పుడు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టుల ద్వారా సత్వర న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థను సమీక్షించవలసిన అవసరం ఉంది. సమాజంలో మారుతున్న, మారిన పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను మార్చుకోవలసిన అవసరం తక్షణం ఏర్పడింది. ఒక్క నేరానికి సంబంధించి సంవత్సరాల తరబడి విచారణ కొనసాగితే బాధితులకు న్యాయం జరగడం కలగానే మిగిలిపోతుంది.

కేసులను అదనపు గౌరవంగా చూస్తున్నరు

మరోవైపు మహిళలను రేప్ చేసి చంపినా, కుటుంబాలను బలి తీసుకున్నా, హీనమైన, ఘోరమైన ఘటనలకు పాల్పడ్డా అసలు కేసులే లేకపోవడం, కేసులు పెట్టినా కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చి ఆ కేసులను అదనపు గౌరవంగా భావిస్తూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగరేసుకొని ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్లనే రౌడీయిజం రంగుమార్చి రాజకీయం అవుతోంది. రౌడీలు రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ, ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కోసం తపిస్తూ ప్రశ్నించే, పోరాడే సామాన్యుల నుంచి కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులపై యూఏపీఏ (ఉపా) లాంటి చట్టాల ద్వారా దేశద్రోహం కేసులు మోపి ఏండ్ల తరబడి బెయిల్ రానివ్వని స్థితి ఉంది.

సమాజంలోనూ మార్పు అవసరం

వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, చట్టాలను సమూలంగా మార్చడానికి వివిధ దేశాల్లో అవినీతి కేసులు, మహిళలపై అత్యాచారాలు, నేరప్రవృత్తిని అరికట్టడానికి అమలు చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మన దేశ పరిస్థితులకు వాటిని అన్వయించి కఠిన చట్టాలను రూపొందించాలి. ప్రధాని, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలు.. రాజకీయ నాయకులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నీతివంతులుగా, సత్యశీలురుగా, అవినీతి వ్యతిరేక యోధులుగా ప్రకటనలు చేసే కీలక స్థానాల్లోని వ్యక్తులు.. తమ పార్టీల గెలుపు కోసం మాత్రం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు ఎలా వస్తున్నది, వీటిని ఎలా నియంత్రించాలనే దానిపై చట్టాలను పకడ్బందీగా మార్చాలి. అలాగే ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. గతంలో నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి, కఠిన చట్టాలను రూపొందించి, న్యాయ వ్యవస్థలో త్వరగా తీర్పులను వెలువరించి, దోషులుగా తేలిన వారిని చట్టసభల్లో పోటీ చేయకుండా నిరోధించే సంస్కరణలు జరిగితే భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో నేరస్తులను నిలువరించవచ్చు. నేర రాజకీయాలను దూరంచేసి నిజాయితీతో కూడిన రాజకీయాల దిశగా ముందుకు సాగుదాం.

రాజకీయాల్లో ధన, కుల ప్రభావం ఉండొద్దు

అధికారం మాటున నేరాలు జరిగినప్పుడు 90 శాతం ఘటనల్లో ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నారు. ఒకవేళ ధైర్యం కూడగట్టుకొని ఎవరైనా ఫిర్యాదు చేసినా కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసు యంత్రాంగం సాహసించడం లేదు. పాల్వంచ పోలీసులు భూక్యా జ్యోతి ఘటన నాడే స్పందించి ఉంటే.. నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదనేది వాస్తవం. ఈ తరహా ఘటనలు కొత్తగూడెమో, మరో ప్రాంతానికో పరిమితం కాలేదు. ఒక రాఘవకో మరొకరికో పరిమితమై జరగడం లేదు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని నేరచరిత్ర కలవారు పని చేస్తున్నంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడో కాని అవి వెలుగులోకి రావు. రాజకీయ సంబంధమైన నేరాలను, కబ్జాలను, అక్రమాలను అరికట్టాలంటే ముందుగా రాజకీయాల నుంచి నేర చరితులను వేరు చేయాలి. వేరు చేయాలంటే రాజకీయాల్లో ధన, కుల ప్రభావాలకు స్వస్తి పలకాలి. డబ్బున్నవాడు ఎటువంటి వ్యక్తి అయినా గెలిచే పరిస్థితి ఏర్పడితే రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకోవడం సాధ్యంకాదు. 

క్రిమినల్స్​కే పార్టీలు టికెట్లు ఇస్తున్నయ్​

2019 లోక్​సభ ఎన్నికల్లో గెలిసిన 539 మంది సభ్యుల్లో 233 మంది క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లోక్​సభ ఎన్నికల కంటే ఇది 44 శాతం ఎక్కువ. అలాగే అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రిపోర్ట్ ప్రకారం 22 రాష్ట్రాల్లోని 2,556 మంది(దాదాపు సగం) ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులను ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఈ సంఖ్య 4,442కుపైగానే పెరుగుతుంది. అలాగే అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న 334 మందికి గత లోక్​సభ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. మహిళలపై దాడులు, రేప్ ఆరోపణలు, అత్యాచార ప్రయత్నాలు, వ్యభిచార వృత్తిలోకి దింపడానికి మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలికల కొనుగోళ్లు తదితర తీవ్ర ఆరోపణలు కలిగిన 51 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇలాంటి వారికి సీట్లు కేటాయించిన పార్టీల్లో బీజేపీ ముందు ఉంది. తర్వాత స్థానాల్లో శివసేన, తృణమూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి.

– కూనంనేని సాంబశివరావు, 

మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి