హైదరాబాద్ కు మరో బయోటెక్నాలజీ కంపెనీ.. ఆమ్ జాన్ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం

హైదరాబాద్ కు మరో బయోటెక్నాలజీ కంపెనీ.. ఆమ్ జాన్ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం

అమెరికాలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ సంస్థ అయిన ఆమ్ జాన్ కంపెనీ.. హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు సిద్ధం అయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్ జాన్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగంతో.. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీథర్ బాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. 

బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆమ్జెన్ హైదరాబాద్ లో టెక్నాలజీ, ఇన్నేవేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. హైటెక్ సిటీలో ఈ సైట్ ఏర్పాటు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో  డాక్టర్ డేవిడ్ రీస్ మరియు మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో ఇవాళ సమావేశమయ్యారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న సీఎం, మంత్రి అభ్యర్థనకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. మెడిసిన్, లైఫ్ సైన్సెస్, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ప్రపంచ స్థాయి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

ఈ సంస్థ ఏర్పాటైతే 3 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆమ్జెన్ 40 ఏండ్ల నుంచి బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఇండియాలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆమ్జెన్ హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించడం శుభసూచికమన్నారు. నగరం ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ఉందని తెలిపారు.. రోగులకు సేవ చేయాలనే అంజెన్ మిషన్ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.