ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెబ్బేరు, శ్రీరంగాపూర్​, వెలుగు: మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. శుక్రవారం శ్రీరంగాపూర్ రంగ సముద్రం‌, పెబ్బేరు మహాభూపాల సముద్రం చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. అనంతరం శ్రీరంగాపురం, పెబ్బేరులో లబ్ధిదారులకు పింఛన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. దాదాపు 50 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని,  ఇచ్చిన మాట ప్రకారం మరో పది లక్షల మందికి కూడా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.  ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తూ మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నామని చెప్పారు.  సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదని, కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నా.. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఆపలేదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, పెబ్బేరు మున్సిపల్​ చైర్‌‌పర్సన్‌, వైస్​ ఛైర్మన్లు కరుణశ్రీ, కర్రెస్వామి, ఎంపీపీలు ఆవుల శైలజ, గాయత్రి, జడ్పీటీసీ పద్మ, వనపర్తి మున్సిపల్​ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయండి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఎస్పీ మనోహర్, అడిషనల్‌ కలెక్టర్లు మనూ చౌదరి, మోతీలాల్, ఆర్డీవోలు, ఇతర జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  16న ర్యాలీ, 17న పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ, 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛ గురుకులం, స్వచ్ఛ స్కూల్‌ టీచర్లకు  సన్మానం ఉంటుందన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, భోజన సౌకర్యం కల్పించాలని తహశీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించారు.  14 నుంచి 18 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీసులను త్రివర్ణ విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.    

సారూ.. భోజనం బాగలేదు

కలెక్టర్‌‌ను కలిసిన హాస్టల్ స్టూడెంట్లు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. శుక్రవారం పది మంది  కలెక్టర్ ఉదయ్ కుమార్‌‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ ఉదయ్ కుమార్ వెంటనే హాస్టల్‌ విజిట్ చేసి రిపోర్ట్‌ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్‌ ఆదేశించారు. దీంతో ఆయన హాస్టల్‌కు వెళ్లి కిచెన్‌, భోజనాన్ని పరిశీలించారు. ఆయన సమక్షంలో మళ్లీ  అన్నం వండగా.. అందులోనూ రాళ్లు వచ్చాయి.  దీంతో వంట సిబ్బంది, వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  భోజనం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని, తీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   అనంతరం స్టూడెంట్లతో మాట్లాడి వసతుల గురించి ఆరా తీయగా..  పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.  మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెప్పగా.. వార్డెన్‌ను మందలించారు.  అలాగే టాయిలెట్స్‌  అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో  సుదర్శన్, పర్యవేక్షకులు రాంజీ, వార్డెన్ రాధ ఉన్నారు.  

నిమజ్జనోత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

నారాయణపేట, వెలుగు: గణేశ్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా సెంటర్​చౌక్‌లో విశ్వహిందూ పరిషత్​ నేతలు  ఏటా స్టేజీ ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్‌ ఇయర్ మున్సిపల్​చైర్​పర్సన్​ ఆధ్వర్యంలో సపరేట్‌గా స్టేజీ వేశారు. అయితే ఈసారి ఇరు వర్గాలు ఒకే స్టేజీ ఏర్పాటు చేయాలని అనుకున్నా.. రాజకీయ కారణాలతో సపరేట్‌గా స్టేజీలు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా  విశ్వహిందు పరిషత్ ​వాళ్ల తరఫున ఓ ఎలక్ట్రీషియన్‌ అక్కడ ఉన్న స్తంభానికి మైక్‌ కడుతుండగా.. టీఆర్ఎస్ ​నేతలు అతన్ని కులం పేరుతో దూషించారు. దీంతో వీహెచ్‌పీ నేతలతో పాటు ఎలక్ట్రీషియన్‌ కులస్తులు వచ్చి వాగ్వాదానికి దిగారు.   చౌక్​బజార్‌‌కు వచ్చి సారీ చెప్పాలని డిమాండ్​ చేస్తూ రాస్తారోకో చేశారు.  విషయం తెలుసుకున్న డీఎస్పీ, సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి   పంపిస్తుండగా టీఆర్‌‌ నేతలు మరోసారి రెచ్చగొట్టారు.  దీంతో ఇరువర్గాల మధ్య  ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు అందరినీ చెదరగొట్టారు. అనంతరం ఎలక్ట్రీషియన్‌ కులస్తులు టీఆర్‌‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్‌‌ ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌‌లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని టీఎంఎం స్టేట్ ప్రెసిడెంట్ మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓసీలకు 80 నుంచి 60కి మార్కులు తగ్గించారని,  ఎస్సీ, ఎస్టీలకు కూడా 60 మార్కులే కటాఫ్ పెట్టడం సరికాదన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.   బీసీలకు 50 మార్కెటులు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు కటాఫ్‌‌ మార్కులు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ మంత్రి చెన్నకేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్  రాఘవేందర్,  జనరల్ సెక్రటరీ వెంకటేశ్‌‌,  సెక్రటరీ బ్యాగరి వెంకటేశ్, నేతలు ఆంజనేయులు, మాసయ్య, చెన్నయ్య, సాతర్ల శివకుమార్, నరేశ్ పాల్గొన్నారు. 

అథ్లెటిక్స్‌లో మల్లికకు గోల్డ్ మెడల్

అమ్రాబాద్, వెలుగు:  ఏపీలో గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీలో ఈ నెల 9 నుంచి 11వరకు నిర్వహిస్తున్న 32వ సౌత్ జోన్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమ్రాబాద్ మండలం మన్ననూర్ గురుకుల కాలేజీకి చెందిన మల్లిక 3 వేల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది.  శుక్రవారం ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ సౌత్ జోన్ అథ్లెటిక్స్ మొదటి రోజు గోల్డ్‌ మెడల్‌తో బోణీ చేసిందన్నారు.  డిండి గురుకుల క్రీడా అథ్లెటిక్స్ అకాడమీలో కోచ్ పరశురాం దగ్గర ఆమె శిక్షణ పొందుతున్నట్లు వివరించారు.  మల్లికను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరర్‌‌ ఎడ్మ శ్రీను యాదవ్, సీనియర్ క్రీడాకారులు, టీచర్లు అభినందించారు.

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలి

జడ్చర్ల టౌన్, వెలుగు:  జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి వద్ద ఎన్‌‌హెచ్‌‌ 44పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలూరు గ్రామానికి చెందిన  చాపల లలిత,  చాకలి యాదయ్య,  బుర్ర కృష్ణయ్య కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలని  జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.  ఉపాధి హామీ కూలీలను ఎన్‌‌హెచ్‌‌పై మొక్కలు నాటేందుకు జీపీకి సంబంధించిన ట్రాక్టర్‌‌‌‌లో ఎలా పంపిస్తారని ప్రశ్నించారు.  కాంట్రాక్టర్‌‌‌‌, అటవీ శాఖ వారు మొక్కలు నాటాల్సిఉందని, జీపీ అధికారుల నిర్లక్ష్యంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు.  

కాళోజీని యాది జేసుకున్రు

‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అని చాటిన కాళోజీ నారాయణ రావును ఉమ్మడి జిల్లా జనం, అధికారులు యాది జేసుకున్నరు.  శుక్రవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, పార్టీ ఆఫీసుల్లో ఆయన ఫొటోకు పూలదండలు వేసి దండం పెట్టిన్రు. కలెక్టర్లు, ఎస్పీలు, నేతలు మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషలో రచనలు చేసి ప్రజల్లోకి తీసుకుపోయిండని కొనియాడిన్రు. ఒక్క సిరా చుక్కతో లక్ష మెదళ్లకు కదలించినా.. అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు.. ఏ పాటి వాడో చూడు.. అంటూ పార్టీలపై తనదైన శైలిలో సెటైర్లు వేయడం ఆయనకే చెల్లిందన్నరు.  కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన్రు...

నెట్‌వర్క్‌, వెలుగు

పుట్టిన పిల్లలకు ముర్రుపాలు తాగించాలి

గద్వాల, వెలుగు:  డెలివరీ అయిన గంటలోపే పుట్టిన పిల్లలకు ముర్రుపాలు తాగించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో పోషకాహారంపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులతో పాటు వారి పేరెంట్స్‌, అత్తామామలకు పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించాలన్నారు.  మెడికల్ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు రక్తహీనత ఉన్న గర్భిణుల విషయంలో  స్పెషల్ కేర్‌‌ తీసుకోవాలని ఆదేశించారు.  రక్తహీనత ఉన్న పిల్లలకు బాలామృతం పంపిణీ చేయాలన్నారు.  గర్భిణులు, బాలింతలు,  కిశోర బాలికలకు క్వాలిటీ ఫుడ్ పెట్టి ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ఈ మీటింగ్‌లో డీఎంహెచ్‌వో చందు నాయక్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ముసాయిదా బేగం, డీఆర్‌‌డీఏ ఇన్‌చార్జి పీడీ నాగేంద్రం పాల్గొన్నారు. 

క్రీడల్లో రాణించాలి

కల్వకుర్తి, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు.  పట్టణంలోని బీసీ బాలికల గురుకులంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బాలికల ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన ఎమ్మెల్యే గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  గెలుటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు.

మల్లెల తీర్థం గుండంలో యువకుడు గల్లంతు

అమ్రాబాద్, వెలుగు:  నల్లమలలోని మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ వద్ద ఉండే  గుండంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. బాధితుల వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన ఆరిఫ్, ఫర్హాన్, మన్సూర్, మన్నన్  అల్సం స్నేహితులు   శనివారం సాయంత్రం హైదరాబాదు నుంచి బయలుదేరి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం అమ్రాబాద్ మండలంలోని మల్లెల తీర్థం  వాటర్ ఫాల్స్  వద్దకు వెళ్లారు. అక్కడ స్నానం చేస్తున్న క్రమంలో కాలుజారడంతో ఆరిఫ్ ( 22) గుండంలోకి పడ్డాడు.  ఆరిఫ్‌తో పాటు ఫ్రెండ్స్‌కు కూడా ఈత రాకపోవడంతో అతన్ని కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు  గుండంలో వెతికినా ఆచూకీ దొరకలేదు. 

కల్వకుర్తిలో చోరీ

కల్వకుర్తి, వెలుగు:  కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చోరీ జరిగింది. ఎస్సై రమేశ్  వివరాల ప్రకారం..  విద్యానగర్‌‌కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి గురువారం రాత్రి కుటుంబంతో కలిసి  వినాయక శోభాయాత్ర చూసేందుకు వెళ్లాడు. నిమజ్జనం అనంతరం రాత్రి రెండుగంటల సమయంలో  ఇంటికి వచ్చారు.  ఇంటి తాళాలు పగులగొట్టి, కప్ బోర్డులు తెరిచి ఉండడం గమనించిన వాళ్లు చెక్‌ చేయగా.. 55 తులాల బంగారం,  రూ.3 లక్షలు కనిపించలేదు.  వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు  స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ పూటేజీని చెక్‌ చేసి రాత్రి ఒంటి గంట సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు.  విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. 

గణపయ్యా.. పోయిరావయ్యా..

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య గంగ ఒడికి చేరాడు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణనాథులను శోభాయాత్ర ఆకట్టుకున్నది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, వినాయకుడికి పూజలు చేశారు.   అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో విగ్రహాలను ఉంచి గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

–మహబూబ్‌ నగర్‌‌ నెట్‌వర్క్‌, వెలుగు