- ధూమల్, జై షా వెల్లడి
న్యూఢిల్లీ : ఈ సీజన్ ఐపీఎల్ మొత్తం ఇండియాలోనే జరుగుతుందని లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్, బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో లీగ్‌ను యూఏఈకి షిఫ్ట్ చేస్తారని వస్తున్న వార్తలను ఖండించారు. దేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు దశల్లో లోక్‌సభ పోలింగ్ జరగనుంది. దాంతో ఐపీఎల్ రెండో దశ పోటీలను యూఏఈకి తరలిస్తారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అయితే, ఇవన్నీ ఊహాగానాలే అని అరుణ్ ధూమల్ చెప్పారు. ‘ఐపీఎల్‌ను ఎక్కడికీ తరలించడం లేదు. త్వరలోనే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం’ అని తెలిపారు. లీగ్‌ను మరో దేశానికి తీసుకెళ్లడం లేదని జై షా సైతం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే 21 మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చింది.