భగీరథకు లీకేజీలే సమస్య..! గ్రేటర్ లో వరంగల్ ఓల్డ్ పైప్ లైన్లతో ఇబ్బందులు

భగీరథకు లీకేజీలే సమస్య..! గ్రేటర్ లో వరంగల్  ఓల్డ్  పైప్ లైన్లతో ఇబ్బందులు

 

  • లీకేజీలు, వాల్వ్ రిపేర్లతో వాటర్ సప్లై కి అవాంతరాలు
  • మాటలకే పరిమితమవుతున్న డైలీ వాటర్ సప్లై సిస్టం
  • 'సమ్మర్ యాక్షన్ ప్లాన్' పై దృష్టి పెట్టని ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ లో డైలీ వాటర్​సప్లై సిస్టం మాటలకే పరిమితమైంది. లీకేజీలు, వాల్వ్​రిపేర్లు, ఫిల్టర్​బెడ్లలో సమస్య పేరున తరచూ తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండగా, ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. నగరంలో కొన్నేండ్ల కిందట వేసిన పైపులైన్​శిథిలావస్థకు చేరి, తరచూ లీకేజీలు ఏర్పడుతుండగా, నియంత్రణకు ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. ఇంకొద్ది రోజుల్లేనే వేసవి ప్రారంభం కానుండగా, సమ్మర్​యాక్షన్​ప్లాన్​రెడీ చేసి కాలనీల్లో పైపులైన్​ రిపేర్లు, లీకేజీల నియంత్రణ, కొత్త కాలనీలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

డైలీ వాటర్​ సప్లై  మాటలకే పరిమితం..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా, సుమారు 11 లక్షల వరకు జనాభా నివసిస్తోంది. కాగా, నగరంలోని ప్రతి ఇంటికీ రోజూ నీటిని సరఫరా చేయాలనే డిమాండ్​ఎప్పటి నుంచో ఉంది. ఈ మేరకు అమృత్, అర్బన్​మిషన్​ భగీరథ స్కీం కింద రూ.630 కోట్లకు పైగా నిధులు వెచ్చించి నగర వ్యాప్తంగా వాటర్​ట్యాంకులు, పైపులైన్ల వ్యవస్థను బలోపేతం చేశారు. ఆ తర్వాత 2021లో గ్రేటర్​ ఎలక్షన్స్ కు ముందు అప్పటి మంత్రి కేటీఆర్​నగరంలో డైలీ వాటర్​ సప్లై సిస్టంను ప్రారంభించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం డైలీ వాటర్​సప్లై సిస్టం మాటలకే పరిమితమైంది. కొన్ని చోట్ల రెండు రోజులకోసారి తాగునీటి సరఫరా జరుగుతుండగా, వివిధ సమస్యల కారణంగా ఇంకొన్ని ఏరియాలకు రెండు, మూడు రోజులైనా తాగునీటి సరఫరా జరగడం లేదు. 

లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు..

మిషన్​ భగీరథ కింద తాగునీటిలో లోపాలను గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మండలాల వారీగా ప్రత్యేక బృందాలు సర్వే చేస్తున్నాయి. రెండు రోజులుగా ఈ సర్వే కొనసాగుతుండగా, తాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర సమస్యలను అధికారులు గుర్తిస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో మాత్రం క్షేత్రస్థాయి సమస్యలపై ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నగరంలో లీకేజీల గుర్తింపు, నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం వల్ల నిత్యం 40 ఎంఎల్​డీలకు పైగా తాగునీరు వృథాగా పోతుండగా, అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. కొద్దిరోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఉండగా, ఇప్పటికే ఆఫీసర్లు సమ్మర్ యాక్షన్​ప్లాన్ రెడీ క్షేత్రస్థాయిలో రిపేర్లు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ కార్యచరణ మొదలుకాకపోవడంతో ఈసారి కొన్ని ప్రాంతాలకు ఇక్కట్లు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై గ్రేటర్​ఎస్ఈ ప్రవీణ్​చంద్రను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, స్పందించకపోవడం గమనార్హం.

లీకేజీల పేరున రూ.కోట్లు ఖర్చు..

అమృత్, మిషన్​ భగీరథ స్కీం కింద పనులు చేపట్టి నగరంలో మొత్తంగా 26.7 కిలోమీటర్ల మేర రా వాటర్ మెయిన్స్, 217.3 కి.మీల ఫీడర్ మెయిన్స్, 125 వాటర్ ట్యాంకులు, 2767.3 కి.మీల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయగా, అందులో సగానికిపైగా 40 ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్​ వ్యవస్థే ఉంది. దీంతో పైపులైన్లు శిథిలావస్థకు చేరి, తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఒక్కో డివిజన్ లో దాదాపు పది లీకేజీలైనా ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతుండగా, నగర వ్యాప్తంగా 600కుపైగా లీకేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఏటా లీకేజీల నియంత్రణకు సగటున రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న గ్రేటర్​ఆఫీసర్లు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.