తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు కలలుగన్న మన రాష్ట్ర ఉద్యమ నినాదాలయిన నీళ్లు, నిధులు, నియామకాలు భర్తీ చేయడం మా విధానం అని ఇక్కడి ప్రజలను నమ్మించి బీఆర్ఎస్ ఓట్లు వేయించుకొని సీట్లు గెలిచింది. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినాక కూడా నిరుద్యోగుల జీవితాలలో అంధకారం తొలగిపోలేదు. ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేయగానే నిరుద్యోగులు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని.. తమ కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలని, కొండంత ఆశలతో ఉంటారు. ప్రస్తుతం అప్పులు చేసి కోచింగ్ సెంటర్కు డబ్బులు కట్టి హాస్టల్ జీవితాలు గడుపుతున్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని ఉద్యోగం సంపాదించటమే లక్ష్యంగా రాత్రి, పగలు తేడా లేకుండా చదివి.. పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురు చూస్తారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందకరమైన వార్త తల్లిదండ్రులకు చెప్పాలని.. వారి కళ్ళల్లో ఆనందం చూడాలని నిరుద్యోగ యువత ఆశిస్తారు.కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9ఏండ్లు గడుస్తున్నా విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ వివాదాలకు దారి తీసిందే తప్ప ఉద్యోగాలు నింపడానికి ఉపయోగపడలేదు. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశలు పెట్టుకొని ఉద్యోగం రాని కారణంగా వరంగల్, కరీంనగర్, వనపర్తి లాంటి అనేక జిల్లాల్లో అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని వ్యక్తి గత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని నిరుద్యోగుల ఆత్మహత్యలను కూడా వెక్కిరించింది.
2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 3,016 నిరుద్యోగ భృతి అందిస్తానని ప్రకటించి, నిరుద్యోగ భృతి అంశాన్ని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ నిరుద్యోగుల ఓట్ల కారణంగానే కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 5 ఏండ్లలో నిరుద్యోగులను వెక్కిరించిందే తప్ప, ఇచ్చిన హమీ గురించి కనీసం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్లు సజావుగా సాగి ఉద్యోగాలు పొందుతుంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇంకా కొట్లాటే మిగిలింది. యువతకు ఉద్యోగాలు రాలేదు.
గ్రూప్1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలయ్యాక నిరుద్యోగులు కోటి ఆశలతో పరీక్ష రాశారు.
పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు అయింది. మొదటిసారి చేసిన తప్పులను సరిద్దిద్దకుండానే అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యంగా టీఎస్పీఎస్సీ మళ్లీ పరీక్ష నిర్వహించింది. హైకోర్టు గ్రూప్ -1 పరీక్షను రద్దు చేసి మందలించడం టీఎస్పీఎస్సీ పనితీరుకు అద్దం పడుతోంది. పరీక్ష పేపర్లు లీక్ కావడం, మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతింది.విద్యాశాఖలో 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు పోరాటం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఎన్నికల కోడ్ రావడం వల్ల అన్ని పరీక్షలు వాయిదా పడటం నిరుద్యోగుల్లో తీరని నిర్వేదాన్ని నింపింది. ఇటీవల విడుదలయిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు చూసుకొని చాలామంది అభ్యర్థులు ఉద్యోగం వచ్చింది.. అనుకునే లోపే కోర్టులో కేసు పడింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం ఈ ప్రభుత్వానికి ఒక పనిగా మారింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే పాలకులను శాశ్వత నిరుద్యోగులుగా మార్చే సమయం ఇప్పుడు వచ్చింది.
- శ్రీధర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు