- కొరియా టెక్నాలజీ వాడాలని సర్కారు యోచన
- మంత్రి ఉత్తమ్, అధికారులకుకొరియా సంస్థ యూయిల్ ప్రజెంటేషన్
- సాఫ్ట్లోన్స్ కింద ప్రాజెక్టులుచేపట్టాలని మంత్రి ప్రతిపాదన
- ఏదుల–డిండి లింక్‌లో రబ్బర్‌డ్యామ్ నిర్మాణం
- రోళ్లవాగు సీపేజీ సమస్యకు దానితోనే చెక్
- మూసీ ప్రాజెక్టు, మంజీరా ప్రాజెక్టులోనూ టెక్నాలజీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో రబ్బర్ డ్యామ్ టెక్నాలజీని వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. ఏదుల రిజర్వాయర్‌నుంచి డిండి లిఫ్ట్ స్కీమ్‌కు తరలించే ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్‌ను నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు రోళ్లవాగు వద్ద సీపేజీ సమస్య అధికంగా ఉండడంతో దానిని అరికట్టేందుకూ ఈ టెక్నాలజీనే వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అలాగే, మూసీ, మంజీరా ప్రాజెక్టుల్లోనూ రబ్బర్ డ్యామ్‌లను నిర్మిస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.
దీనికి సంబంధించి కొరియా టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా బుధవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులకు కొరియాకు చెందిన యూయిల్ అనే సంస్థ ప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే, సాఫ్ట్లోన్స్ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా కొరియా సంస్థ ముందు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది.
అంటే తొలుత సంస్థనే పెట్టుబడులు పెట్టి రబ్బర్ డ్యామ్‌లను నిర్మిస్తే.. ఆ తర్వాత 10 లేదా 20 ఏండ్లపాటు డిపార్ట్‌మెంట్‌నుంచి నెలవారీగా సంస్థకు పేమెంట్లు చేసేలా ఈ ప్రాజెక్టులను చేపట్టాలన్న ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, కర్నాటకలాంటి రాష్ట్రాల్లో కట్టిన రబ్బర్డ్యామ్లను పరిశీలించి ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.
మేడిగడ్డ ఎగువన రబ్బర్‌డ్యామ్?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నీటి లిఫ్టింగ్ ఆగిపోయింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 17 కిలోమీటర్ల దూరంలో జియోబ్యాగ్స్ వేసి, నీటిని మళ్లించి ఎత్తిపోయాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. అక్కడ కూడా రబ్బర్ డ్యామ్ కడితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్టు తెలిసింది. అధికారులు మాత్రం అక్కడ కాజ్బండ్ను నిర్మిస్తే రూ.8 కోట్లలో పూర్తవుతుందని, ఖర్చు తగ్గుతుందని చెబుతున్నట్టు తెలిసింది.
భూసేకరణ, ఖర్చు తక్కువ
రబ్బర్ డ్యామ్‌లతో ప్రయోజనాలు ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. ఇతర పద్ధతులతో పోలిస్తే సులభంగా దానిని నిర్మించొచ్చని అంటున్నారు. తక్కువ ఖర్చు, భూసేకరణ ఎక్కువగా లేకుండా పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. రబ్బర్ డ్యామ్‌లలో రెండు రకాలుంటాయని తెలిపారు. ఒకటి గాలిని నింపి చేపట్టే రబ్బర్ డ్యామ్‌లు కాగా.. రెండోది నీటిని నింపి చేపట్టేవి. డిజైన్లను బట్టి నీళ్లు లేదా గాలితో నింపే వాటిని వాడుతుంటారు.
ఇందులో భాగంగా డ్యామ్‌ను నిర్మించాలనుకున్న ప్రాంతంలో ఫౌండేషన్‌కు పటిష్టంగా ఉండేలా రబ్బర్‌తో చేసిన ట్యూబ్‌ల వంటి నిర్మాణాలను అటాచ్ చేస్తారు. సదరు ప్రాంతంలో నది లేదా చెరువుల సామర్థ్యాన్ని బట్టి డ్యామ్ ఎత్తు/పరిమాణాన్ని నిర్ధారిస్తారు. వాటర్ హైడ్రో స్టాటిక్ ప్రెజర్ (నీటి ప్రవాహ వేగంతో ఏర్పడే) ఒత్తిడి ఆధారంగా ఈ రబ్బర్ డ్యామ్‌లు ఆటోమేటిక్‌గా పనిచేస్తుంటాయి. తక్కువ టైంలో పూర్తవ్వడమేగాక తక్కువ ఖర్చు, సులభమైన నిర్వహణ, తక్కువ కరెంట్ ఖర్చులతోపాటు భూకంపాలను తట్టుకునేలా ఈ నిర్మాణాలు ఉంటాయని చెబుతున్నారు.
మున్నేరు– పాలేరు లింక్‌కు లీకేజీలు
మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్‌కు లీకేజీలు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపైనా మంత్రి ఉత్తమ్ వద్ద చర్చించినట్టు తెలిసింది. వాటి రిపేర్ల పనులకు రూ.200 కోట్ల దాకా ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. దీనిని పూర్తిచేస్తే గ్రావిటీతో పాలేరుకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు.
అయితే, ప్రస్తుతం తయారు చేసిన అంచనాల్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. భూసేకరణ ఖర్చు ఎక్కువ అవుతున్నదని, దానిపై ఓసారి రివిజన్ చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. లింక్ కెనాల్‌కు లైనింగ్ చేస్తే భూసేకరణ తగ్గి, ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మార్పులకు తగ్గట్టుగా ఎస్టిమేట్స్‌ను అప్డేట్ చేయాలని సూచించినట్టు తెలిసింది.