గోల్డ్ జీన్స్‎ ప్యాంట్‎లో దాచా.. యూట్యూబ్‎లో చూసే నేర్చుకున్నా: నటి రన్యా రావు

గోల్డ్ జీన్స్‎ ప్యాంట్‎లో దాచా.. యూట్యూబ్‎లో చూసే నేర్చుకున్నా: నటి రన్యా రావు

బెంగుళూర్: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నటి రన్యా రావు డీఆర్ఐ కస్టడీలో కీలక విషయాలు బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. యూట్యూబ్‎లో చూసే బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నట్లు రన్యా రావు వాంగ్మూలం ఇచ్చిందని తెలిపారు. తాను దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తీసుకురావడం ఇదే తొలిసారని ఆమె చెప్పిందన్నారు. 

‘‘మార్చి 1న నాకు ఒక విదేశీ ఫోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. దుబాయ్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 దగ్గర ఉన్న గేట్ A వద్దకు వెళ్లమని చెప్పారు. అక్కడ బంగారం రెండు ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లలో ఉంది. నేను ఎయిర్ పోర్టు రెస్ట్‌రూమ్‌లో నా శరీరానికి బంగారు కడ్డీలను అటాచ్ చేసుకున్నాను. నా జీన్స్, బూట్లలో బంగారాన్ని దాచా. గోల్డ్ ఎలా దాయాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నా. దుబాయ్ విమానాశ్రయంలో బంగారాన్ని సేకరించి బెంగళూరులో డెలివరీ చేయమని సూచించారు.

నేను దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకు ముందు ఎప్పుడూ దుబాయ్ నుండి బంగారాన్ని తీసుకురాలేదు. నాకు కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. కానీ అతడు 6 అడుగుల పొడవు, తెల్లగా ఉన్నాడు. ఆఫ్రికన్-అమెరికన్ యాసలో మాట్లాడాడు’’ అని నటి రన్యా రావు కస్టడీలో చెప్పిందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. 

ALSO READ | సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ 10 వేలకు పెంచాలి : గడ్డం వంశీకృష్ణ

కాగా.. నటి, డీజేపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2025, మార్చి 3న దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తుండగా కెంపెగౌడ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రన్యా రావును డీఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు రెండో భార్య కుమార్తె. రామచంద్రరావు తన మొదటి భార్య మరణించిన తర్వాత తిరిగి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు ఒకరు.