ఒకప్పుడు కార్మికులతో, వ్యాపారులతో సందడి ఉండే లెదర్ ఇండస్ట్రీ చుట్టు పక్కల ప్రాంతాలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. కర్ప్యూ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. కాన్పూర్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 400 తోళ్ల పరిశ్రమలున్నాయి. కుంభమేళా ప్రారంభం కావడానికి ముందే ఈ పరిశ్రమలను ప్రభుత్వం మూసివేయించింది. కుంభమేళా సందర్భంగా గంగా నది పవిత్రతను కాపాడటం కోసమే లెదర్ ఇండస్ట్రీకి మూడు నెలలు తాళాలు వేయిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే కుంభమేళా ముగిసినా ఇప్పటివరకు లెదర్ ఇండస్ట్రీకి వేసిన తాళాలు తెరచుకోలేదు. దీంతో ఈ పరిశ్రమలపై ఆధారపడ్డ వేలాదికార్మికుల, వ్యాపారుల కుటుం బాలు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నాయి. ‘సర్కార్ ఆదేశాల మేరకు నవంబరులో పరిశ్రమను మూసివేశాం. మూడు నెలలు దాటి పోయాయి. ఇప్పటికీ పరిశ్రమలు తిరిగి తెరిచే అవకాశాలు కనిపించడం లేదు.నాతో పాటు కొన్ని వేల మంది కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. తిండికి కూడా గడవని పరిస్థితుల్లో ఉన్నాం” అని యూపీ లెదర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాజ్ ఆలం అన్నారు.
మూడు నెలలుగా ఇండస్ట్రీ మూతపడి ఉండటంతో వ్యక్తిగతంగా తాను రూ. 15 లక్షలు నష్టపోయాయని ఆలం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి గతంగా నష్టపోవడమే కాదు కొన్నేళ్లబట్టి తమను నమ్ము కుని ఉన్న కస్టమర్లు ఇప్పుడు వేరే వారిదగ్గరకు వెళుతున్నారన్నారు. కేవలం లెదర్ కార్మికులు, వ్యాపారులే కాదు ఈ ఇండస్ట్రీ పై ఆధారపడి టీ స్టాల్స్, చిన్నా చితకా హోటల్స్ , కిరాణా షాపులు నడుపుకునే వారి బతుకులు కూడా రోడ్డున పడ్డాయి. “ లెదర్ బిజినెస్ నడుస్తున్నప్పుడు రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించేదానిని. టీ నీళ్ల కోసం వందలాది మంది కార్మికులు ప్రతి రోజూ నా స్టాల్ దగ్గరకు వచ్చేవారు. ఇప్పుడు టీ తాగడానికి వచ్చే వారే కరువయ్యారు. రోజుకు రెండు వందలు సంపాదించడం గగనమైపోతోంది ” అని ఆవేదన వ్యక్తం చేసింది రామ్ రాణిఅనే టీ స్టాల్ ఓనర్. ఒక్కో లెదర్ ఇండస్ట్రీలో వంద నుంచి దాదాపు మూడు వందల మంది కార్మికులు పనిచేస్తుం టారు. వీరిలో ఎక్కువ మందికి రోజుకు ఆరు లేదా ఏడు వందలవరకు చెల్లిస్తుంటారు. వీరంతా టెంపరరీయే. పరిశ్రమలకు తాళాలు పడటంతో డైలీ వేజ్ కార్మికులంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఎప్పుడూ కార్మికులతో సందడి గా ఉండే లెదర్ ఇండస్ట్రీ చుట్టు పక్కల ప్రాంతాల ప్రస్తుతం నిర్మానుష్యం గా మారాయి. కర్ప్యూ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి.