అసలు విషయం వదిలి అసత్య ప్రచారాలా? : కరుణ గోపాల్

ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే ఇటీవల స్వదేశీ జాగరణ్​ మంచ్​నిర్వహించిన వర్చువల్​ కాన్ఫరెన్స్​లో దేశంలో పేదరికం, నిరుద్యోగం గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది సహా, ప్రతిపక్షంలో ఉన్న వారు, కొన్ని మీడియా చానెళ్లు తీవ్రంగా స్పందించాయి. దత్తాత్రేయ ఏ సందర్భంలో అలా మాట్లాడారో గుర్తించని ఉద్ధవ్​థాక్రే బీజేపీకి ‘అద్దం’ చూపించినందుకు అభినందనలు అని చెప్పారు. హెచ్‌‌డీ కుమారస్వామి స్పందిస్తూ ‘అచ్ఛే-దిన్’ అని ప్రశ్నించారు. జైరాం రమేశ్ ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ను టార్గెట్ చేస్తూ ‘విషం వ్యాపిస్తున్న వారు కూడా పేదరికం గురించి మాట్లాడుతున్నారు’ అని అన్నారు.

ఊహించినట్లుగానే, అనేక వార్తాపత్రికలు ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. మోడీ ప్రభుత్వం పనితీరు సరిగా లేని కారణంగానే ఆర్ఎస్ఎస్​ ఇలాంటి విమర్శలు చేసిందని వార్తల రచయితలు ఉన్న పళంగా తేల్చి పడేశారు. బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ల మధ్య విభేదాలు పెరిగిపోయాయని మరికొందరు ప్రకటించారు. కానీ ఏ ఒక్కరూ ఆయన మాట్లాడిన ‘‘సందర్భం” గురించి అస్సలు పట్టించుకోలేదు. 

దేశ విజయాలను ఓర్వలేకనే..

ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ భారతదేశం ముందుకు దూసుకుపోతోందన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ జార్జివా ఇటీవల చెప్పిన ఓ విషయం ప్రస్తావించాలి. ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశం పరిస్థితీ బాగా లేదని, ఆర్థిక అస్థిరత, భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, తరచూ జరిగే విధ్వంసకర ప్రకృతి వైపరీత్యాలతో- అన్నీ అతలాకుతలమవుతున్నాయని ఆమె అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న- యూరోప్, చైనా, యునైటెడ్ స్టేట్స్- వృద్ధి మందగిస్తున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు.

ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ భారతదేశం ఆర్థిక సుస్థిరతను ప్రపంచం గుర్తించిందంటే, అది -ప్రధాని మోడీ దూరదృష్టి నాయకత్వ ఫలితమే. నోబెల్ బహుమతి గ్రహీత ఎ. మైఖేల్ స్పెన్స్ ఇటీవల భారతదేశం అత్యుత్తమ పనితీరును కొనియాడారు. లైఫ్ సైన్సెస్, డిజిటల్ గవర్నెన్స్‌‌లో ఇండియా అధునాతన టెక్నాలజీల పవర్‌‌హౌస్ అని ఆయన అన్నారు. సెప్టెంబర్‌‌లో భారతదేశం నిరుద్యోగిత రేటు 6.43 శాతానికి పడిపోయింది. తయారీ, సేవా రంగాల్లో బలమైన పనితీరుతో కరోనా తర్వాత ‘కే’ ఆకారపు రికవరీని సాధిస్తున్నట్లు ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ ధ్రువీకరించారు. అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి ఇండియా ఇంకా పూర్తిగా బయట పడనందున అప్రమత్తంగా ఉండాలి. కరోనా తర్వాత పెరిగిన పేదరకం, అసమానతలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.

బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్ రెండూ సమష్టిగా కదులుతాయి. బహుశా భవిష్యత్తులోనూ కొందరు అల్లరి చేయాలనుకుంటుండొచ్చు. అయితే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే. ప్రధాని మోడీ ప్రారంభించిన “ఇండియాను స్వావలంబన దేశంగా చేయడం – ఆత్మనిర్భర్ భారత్” ఆర్ఎస్​ఎస్ ​సైద్ధాంతిక వేత్త దత్తోపంత్ తెంగడి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే.  ఆయన ‘స్వదేశీ ఎకనమిక్స్’ ప్రస్తుతం గొప్ప విషయంగా పరిగణనలో ఉంది. చివరి పేదవాడి వరకు అన్నం పెట్టాలనే అంత్యోదయ ఆలోచన పండిట్​దీన్​దయాళ్​ఉపాధ్యాయ ప్రేరణతో పుట్టిందే. 

అసలు ఆ సందర్భం ఏమిటి?

వాస్తవానికి దత్తాత్రేయ ఏం మాట్లాడారు? ఆ సందర్భం ఏమిటనేది చూస్తేనే వాస్తవాలు బయటకొస్తాయి. ‘‘దేశంలో పేదరికం మన ముందు దెయ్యంలా నిలబడ్డది. దాన్ని సంహరించడం చాలా ముఖ్యం” అని స్వదేశీ జాగరణ్ మంచ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆర్‌‌ఎస్‌‌ఎస్  ప్రారంభించిన “స్వావలంబి భారత్ అభియాన్– ఏ భారతీయ ఎకనమిక్​మోడల్’’ గురించీ చర్చించారు. అభియాన్ లో భాగంగా గత ఏడాది నుంచి ఎంటర్​ప్రెన్యుర్షిప్​ను ప్రమోట్​చేయడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెంచడం దీని లక్ష్యం. 2022 మార్చిలో ఆర్ఎస్ఎస్ తన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశంలో “భారతీయ ఎకనమిక్​ మోడల్’’ కోసం పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

స్వావలంబన భారతదేశం కోసం దేశవ్యాప్తంగా దాదాపు 700 జిల్లాల్లో ఈ ఉద్యమం క్రీయాశీలంగా కొనసాగుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సమాజం అభినందించాలని ఆర్ఎస్ఎస్​పేర్కొంది. అక్కడ చేసిన తీర్మానం ప్రభుత్వ విధానాలకు సంబంధించినది కాదన్న సుస్పష్టం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర రూపం దాల్చిన పేదరిక సమస్యను పరిష్కరించడానికి భారతీయులందరి కృషి ఉండాలనే సందర్భంలో దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. పేదరికం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఆయన ‘సమష్టి కృషి’’ కోరుతూ అన్న మాటలవి. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి దీన్ని ఒక అవకాశంగా భావించాయి. అందుకే దత్తాత్రేయ మాట్లాడిన సందర్భాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించి, ఆయన ప్రసంగంలో కొంత భాగాన్ని తీసి ప్రచారం చేశారు. వాస్తవాన్ని వక్రీకరించి, బీజేపీ మద్దతుదారుల విశ్వాసాన్ని వమ్ము చేయాలని ఆశించారు. ఇలాంటి విష ప్రచారాలు వ్యాప్తి చేయడం ఇది మొదటిసారేం కాదు. 

ఏం దొరుకుతుందా? అని చూస్తూ..

ఆర్ఎస్​ఎస్​, బీజేపీ మధ్య చీలిక తెచ్చేందుకు ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఏ చిన్న అంశం దొరికినా పెద్దది చేయాలని చూస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా ఇది జరుగుతున్నప్పటికీ ప్రత్యేకించి 2014 తర్వాత ఈ ధోరణి బాగా కనిపిస్తున్నది. రైతుల సంక్షేమం, వన్​ర్యాంక్​ వన్​ పెన్షన్ లాంటి స్కీముల విషయంలో మోడీ, ఆర్ఎస్ఎస్​ మధ్య ఆధిపత్య పోరు ఉందని చూపే ప్రయత్నాలు జరిగాయి. ఆరెస్సెస్, బీజేపీల మధ్య 70 ఏండ్లకు పైగా కొనసాగిన బలమైన బంధం వారికి బాధ కలిగిస్తున్నట్లుంది. ఇదీగాక మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తున్న తీరు వాళ్ల పుండు మీద కారం చల్లుతున్నట్లుగా చేస్తున్నది.

సమాజంతో నేరుగా పనిచేసే సైద్ధాంతిక భుజం దేశాన్ని పాలించే రాజకీయ రంగానికి సమర్థంగా మద్దతు ఇస్తున్నది. అందుకే ఆర్‌‌ఎస్‌‌ఎస్, బీజేపీలు అన్నదమ్ముల లెక్క. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన కోసం పనిచేస్తుండగా, ఆర్‌‌ఎస్‌‌ఎస్ దేశ నిర్మాణం మీద పనిచేస్తున్నది. ఇక్కడ వైరుధ్యం ఎక్కడా లేదు. ఆర్ఎస్ఎస్,​ దాని 60 వేల శాఖలు, లక్షలాది స్వయంసేవకులు ప్రభుత్వానికి ఒక భారీ సెన్సర్‌‌లా ఉన్నాయి. ప్రభుత్వం తన చర్యలను మెరుగుపరుచుకునేందుకు ఇది దేశంలోని అంతర్భాగాల నుంచి అభిప్రాయాలను అందిస్తున్నది. ప్రతిపక్షాల అభద్రత వల్లే ‘తప్పుడు’ కథనాలు పుడుతున్నాయి.

(ది డైలీ గార్డియన్​ సౌజన్యంతో..)

- కరుణ గోపాల్, బీజేపీ నేషనల్ ఇన్​చార్జ్, పాలసీ & రీసెర్చ్, ఉమెన్ వింగ్