భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు
  • అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

మెట్ పల్లి, వెలుగు : భర్తను వదిలేసి 20 ఏండ్ల యువకుడితో ప్రేమలో పడి ఎనిమిదేండ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు హత్య చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన సంగం గంగాధర్ తో మమతకు 16 ఏండ్ల కింద వివాహం జరిగింది. గంగాధర్  ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మమత ఎనిమిదేండ్ల కింద అబ్దుల్  అప్సర్(22)తో ప్రేమలో పడింది.

అప్సర్​తో చనువుగా ఉండడంతో మమత, గంగాధర్  మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నాలుగేండ్ల కింద విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అప్సర్ తో సహజీవనం చేస్తోంది. పట్టణంలోని సివిల్ హాస్పిటల్  ఎదురుగా ఉన్న కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని మమత తన పిల్లలతో కలిసి ఉంటోంది. అప్సర్  అక్కడికి వచ్చిపోయేవాడు.  ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి మమత ఫోన్​లో మాట్లాడుతుండగా.. అనుమానంతో ఎవరితో మాట్లాడుతున్నావని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో కోపంలో అప్సర్  గొంతు నులిమి, కత్తితో పొడవడంతో  మమత అక్కడికక్కడే చనిపోయింది. భర్తను వదిలేసి ప్రియుడితో ఎనిమిదేండ్లుగా సహజీవనం చేస్తున్న మమతను ప్రియుడే హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో సర్కార్​ హాస్పిటల్  వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఉమామహేశ్వర రావు, సీఐ నవీన్, ఎస్ఐ చిరంజీవి పరిశీలించారు. మృతురాలి కొడుకు సంగం గ్రహీత్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్ కుమార్  తెలిపారు.