Lebanon: లెబనాన్లో బాంబుల మోత.. ఇజ్రాయెల్ దాడులతో విలవిల.. 274 మంది మృతి

Lebanon: లెబనాన్లో బాంబుల మోత.. ఇజ్రాయెల్ దాడులతో విలవిల.. 274 మంది మృతి

లెబనాన్: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ చిగురుటాకులా వణికిపోతుంది. హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో సోమవారం ఒక్కరోజే 274 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ హెల్త్ మినిస్టర్ ఫిరాస్ అబియాద్ మీడియాకు వెల్లడించారు.

ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 274 మందిలో 21 మంది చిన్నారులు, 31 మంది మహిళలు కూడా ఉన్నట్లు చెప్పారు. హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్, అంబులెన్స్లను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎయిర్స్రైక్స్తో విరుచుకుపడుతుందని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దళ మెరుపు దాడుల్లో 1000 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల్లో రెండు అంబులెన్స్లు కూడా ధ్వంసమైనట్లు ఆయన వెల్లడించారు.

లెబనాన్ రాజధాని నగరం బీరట్లో బాంబుల మోత మోగుతోంది. ఏ క్షణంలో ఏ బాంబు మీదొచ్చి పడుతుందోనని బీరట్ ప్రజలు గజగజా వణికిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే వందల సంఖ్యలో హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దక్షిణ లెబనాన్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

ALSO READ | ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేకపోతే 80 వేల మంది చనిపోతారు: లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్

ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్ ప్రాంతంలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఏ క్షణం బాంబు ఇంటి మీద వచ్చి పడుతుందోననే భయంతో దక్షిణ లెబనాన్లో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ఖండించింది. లెబనాన్పై అత్యంత పాశవికంగా చేస్తున్న ఈ దాడులకు  ఇజ్రాయెల్ అత్యంత ప్రమాదకర పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.