
కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ కలవేని నాగరాజును సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2011లో కాంట్రాక్ట్ మ్యాథ్స్ లెక్చరర్ గా నాగరాజు జాయిన్ అయ్యారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వం 2023లో రెగ్యులర్ చేసింది. రాష్ట్రంలో కొంతమంది నకిలీ పీజీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు పొందినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ గుర్తించి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నాగరాజు పీజీ సర్టిఫికెట్ పై విచారణకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యునివర్సిటీ నుంచి పీజీ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీలో నాగరాజు చదవలేదని, నకిలీ పీజీ సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందాడని అధికారులు గుర్తించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ రాజయ్య గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు . సర్టిఫికెట్ ఫేక్ అని తేలడం తో నాగరాజును సర్వీసు నుంచి తొలగిస్తూ బుధవారంఉత్తర్వులు జారీ చేశారు.