లెక్చరర్​ బతుకును ఆగం చేసిన కరోనా

  • షుగర్ లెవల్స్​ పెరగడంతో రెండు కాళ్లు కోల్పోయిన లెక్చరర్​
  • ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: కరోనా ఓ ప్రైవేట్‍ లెక్చరర్‍ జీవితాన్ని ఆగం చేసింది. అంతకు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కరోనా తగ్గిన తర్వాత  ఒక్కసారిగా షుగర్‍ లెవల్స్​ పెరిగాయి.  కాళ్ల నొప్పులతో మొదలైన సమస్య  మూడు రోజుల్లోనే  రెండు కాళ్లు తీసేవరకు వెళ్లింది. వరంగల్‍ అర్బన్‍ జిల్లా కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉండే పడకంటి రాంచందర్‍(47)  తెలుగు పాఠాలు చెప్పే ప్రైవేట్‍ లెక్చరర్‍.  జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా రేగొండలోని కనిపర్తి నుంచి 15 ఏండ్ల కింద భార్య, ఇద్దరు పిల్లలతో వరంగల్​కు షిఫ్ట్​ అయ్యాడు. ప్రైవేట్​ కాలేజీల్లో పాఠాలు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏప్రిల్‍ 30న కరోనా సింప్టమ్స్​ కనిపించగా టెస్ట్​ చేస్తే ఇంట్లోని నలుగురికి పాజిటివ్​గా తేలింది. హోం ఐసోలేషన్​లో ఉంటూ  ట్రీట్‍మెంట్‍ తీసుకున్నారు.  2 వారాల్లో అందరికీ నెగటివ్‍ వచ్చింది. రాంచందర్​కు మాత్రం కాళ్లనొప్పులు మొదలయ్యాయి. దవాఖానాలో చూపించుకుంటే అడ్మిట్​ కమ్మన్నారు. ఏడాది పని లేక ఇబ్బందిగా ఉందని, ట్రీట్​మెంట్​కు డబ్బులు ఖర్చు పెట్టలేనని మందులు తీసుకుని వెళ్లాడు. 2 రోజుల్లో నొప్పి పెరిగి  పాదాలు నల్లరంగులోకి మారాయి. న్యూరాలజిస్ట్​ను సంప్రదిస్తే .. వెంటనే హైదరాబాద్​ వెళ్లాలని, అయినా  ఓ కాలు తీసేయాల్సిరావచ్చునని  చెప్పారు. దీంతో  మే 18న హైదరాబాద్‍ లోని కేర్‍ హాస్పిటల్లో అడ్మిట్‍ అయ్యాడు. కరోనాతో షుగర్‍ లెవల్స్​ పెరిగి ఆ ఎఫెక్ట్​ కాళ్ల మీద పడిందని, పేషెంట్​ను కాపాడాలంటే రెండు కాళ్లు తొలగించాలని చెప్పారు. అప్పు చేసి ఆపరేషన్​ చేయించుకున్నాడు.  సర్జరీ చేయడంవల్ల రెండు నెల పాటు ఫిజియోథెరపీ చేయించాలి. ఇప్పటికే ట్రీట్‍మెంట్‍ కోసం  రూ.6 లక్షలు అప్పుచేసిన రాంచందర్​ అటు కుటుంబాన్ని పోషించడం, ఇటు మెడికల్​ ఖర్చులు భరించడం ఎలా అని ఆందోళన చెందుతున్నాడు.  ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని  కోరుతున్నాడు.  ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.దాతలు 98493  74562 కు గూగుల్​పే ద్వారా సాయం అందించాలని వేడుకుంటున్నాడు.