- నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘటన
కోటగిరి, వెలుగు : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బుధవారం ఉదయం పంచాయతీ సిబ్బంది వదిలిన మిషన్ భగీరథ నీటిలో జలగ కనిపించింది. స్థానిక వినాయక్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో మిషన్ భగీరథ నల్లా నీటిని పడుతుండగా అందులో జలగ వచ్చింది. గతంలో కూడా చాలాసార్లు మిషన్ భగీరథ నీళ్లల్లో జలగలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కోటగిరి మండల కేంద్రంలో కలుషిత నీరు వస్తుండడంతో పలువురు వాంతులు, విరేచనాలతో దవాఖానల పాలయ్యారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో నీళ్ల ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయాలని కోరారు.