విద్యా విధానంపై విషం చిమ్మే ప్రయత్నం : డా.పి.భాస్కర యోగి

ఈ దేశంలో ‘జాతీయతను, హిందూత్వ’ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న వామపక్ష మేధోవర్గం ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం-–2020ని వ్యతిరేకించడం పనిగా పెట్టుకొన్నారు. కేంద్రం, మోదీ ఏపని చేసినా వ్యతిరేకించే వామపక్షాలు నూతన విద్యా విధానంపై కూడా ఒంటికాలుపై లేస్తున్నారు. పడికట్టు పదాలను అవసరాలకు అనుగుణంగా పుట్టించే ఈ గుంపు కాషాయీకరణ, ప్రైవేటీకరణ అంటూ మరో పదబంధం తెరపైకి తెచ్చారు. ఈ దేశ జాతీయతను ప్రోదిచేసే ఏ అంశం అయినా లెఫ్ట్​వింగ్ వ్యతిరేకించడం వెనుక ప్రపంచ భారత వ్యతిరేక శక్తులు ఉంటాయి. గతంలో ‘డిసిమెంటల్ గ్లోబల్ హిందూత్వ’ పేరుతో దేశ విదేశాల్లోని 40 యూనివర్సిటీలు, 16 విభాగాలు ఈ దుష్ప్రచారంలో భాగం పంచుకున్నాయి. మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో వంటి విదేశీ సిద్దాంతాలు మన యూనివర్సిటీలు, పత్రికలు, రాజకీయాలను ఆవరిస్తే అది పవిత్రం. ఆదిశంకర, రామానుజ, వివేకానందుల, అరవిందుల ఆలోచనలు, భారతీయత గల విలువలు మాత్రం వీళ్ల దృష్టిలో కాషాయీకరణ. దానిని పెద్ద భూతంలాగా ప్రచారం చేస్తారు. 'హిందూఫోబియా' చూపిస్తూ దేశ వ్యతిరేక శక్తులకు ప్రాణం పోస్తారు. గతంలో వాజ్​పేయ్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నపుడు కూడా ఇలాగే భయంకర దుష్ప్రచారం చేశారు. ఏమీ జరగకుండానే కాషాయీకరణ అంటూ నిందలు వేశారు. నాటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మురళీమనోహర్ జోషీ విద్యపై సమీక్ష చేస్తే అక్కడ జరిగిన 'సరస్వతీ వందనం' కార్యక్రమాన్ని చూసి బెంగాల్ విద్యాశాఖామంత్రి, బుద్ధదేవ్ భట్టాచార్య వంటివారు నానా హంగామా చేశారు. జ్ఞానాన్ని సరస్వతిగా భావించే దేశంలో సరస్వతీ వందనం చేయడం 'మహా తీవ్రవాద చర్య లాగా వామపక్షాలు ప్రచారం చేయడం ఈ దేశ మెజార్టీ ప్రజలను ఆలోచింపజేసింది. ఇప్పుడు జాతీయవిద్యావిధానం, కార్పొరేటీకరణ, కాషాయీకరణ అంటూ మరో చారిత్రక తప్పిదం వైపు అడుగులు వేస్తున్నారు. 

జాతీయ విద్యావిధానం‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌2020

ప్రతి దేశానికి కొన్ని విలువలు, సిద్ధాంతాలుంటాయి. దానినే సంస్కృతి అంటారు. అలాగే మనదేశానికి కొన్ని విలువలు ఉన్నాయి. అందునా వేదకాలం నుండి విద్యకు సంబంధించిన ప్రమాణాలున్నాయి. మనదేశంలో విద్యను భౌతిక జీవనం కోసం మాత్రమే నేర్పించలేదు. మనిషి సర్వాంగీణ వికాసానికి విద్యను ఆలంబనగా చేశారు. అవి మనిషి వికాసానికి మూలాలుగా, జీవనాడిగా ఉన్నాయని చెప్పడమేకాదు, నిరూపించబడ్డాయి. ఆ మూలాలు కోల్పోకుండా ఆధునిక విద్యను అందించే పని ఈ జాతీయ విద్యావిధానం-2020 చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. జులై 2020లో కేంద్రమంత్రిమండలి 484 పుటల పత్రం  రూపొందించింది. స్వావలంబన, స్వాభిమానం రెండూ దిక్సూచిలాగా ఈ విద్య ప్రమాణపత్రం రూపకల్పన జరిగింది. కస్తూరి రంగన్​ లాంటి మేధావుల భాగస్వామ్యంతో రూపకల్పన జరిగిన ఈ నూతన విద్యావిధానంపై అధ్యయనం అతి కీలకం. ఇటువంటి దేశానికి అతి ముఖ్యమైన ఒక విధానంపై విమర్శలు చేయడం కోడిగుడ్డుమీద ఈకలు పీకడమే. 

మెకాలే శాడిజం తెచ్చిన విద్యా విధానం 

మన తాతల కాలం నాడు 'లార్డ్ మెకాలే' వంటి మన దేశ వ్యతిరేక మనస్తత్వంతో కూడిన ఒక శాడిస్టు ప్రవేశపెట్టిన విద్యావిధానం ఇంకా మన మెదళ్లలో కొనసాగడం మన ఈ తరం చేసుకున్న దురదృష్టం. అటువంటి అశాస్త్రీయ విద్యతో ఆంగ్లేయ మనస్తత్వ బంట్రోతులుగా మార్చే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. మనం శారీరకంగా భారతీయులుగా ఉన్నాం కానీ మానసికంగా మనలో ఆంగ్లేయ మనస్తత్వం ఉంది. 19వ శతాబ్దిలో నాటి వైస్రాయి లార్డ్ రిప్పన్ కాలంలోని హంటర్ కమీషన్ మొదలుకొని 'సర్వశిక్షా అభియాన్' వరకు ఎన్నో విద్యా ప్రాజెక్ట్లు రిపోర్టులు, కమీషన్లు భారత్ లో వచ్చాయి. ఏవీ సంపూర్ణంగా అమలు కాలేదు, కానివ్వలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 8 వందల కోట్ల జనాభాతో పోల్చుకుంటే భారత్​లో  విద్యనభ్యసించే యువత సంఖ్య చాలా ఎక్కువ. వాళ్లను కేవలం ఆధునికులుగా విలువలు లేని వ్యక్తులుగా తీర్చిదిద్దే ఈ విదేశీ భావజాల విద్య మరో అడుగు ముందుకేసి యాంత్రికంగా  మార్చేస్తున్నది. ఇపుడు రోజూ వార్తల్లో మనం చూస్తున్న అమానవీయ ఘటనలు అందుకు నిదర్శనం.   21వ శతాబ్దపు నైపుణ్యాలైన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్ వంటి వాటి ప్రావీణ్యం ఎంత అవసరమో భారతీయ విలువలైన సమానత్వం, కరుణ, దయ, న్యాయ దృష్టి, నిజాయితీ, సహకారం, మానవత్వం, రాజ్యాంగ విలువలు వంటివీ అంతే అవసరం. ఈ దృష్టికోణంతో రూపొందించినదే నూతన విద్యావిధానం–-2020.

పాఠ్యవిద్య – వృత్తి విద్య జంటగా..

గర్భంలో ఉన్నప్పుడే బుద్ధి నేర్పించాల్సిన ఆవశ్యకతను ఆధునిక మనోవిజ్ఞాన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉన్నప్పుడే నేర్చిన బుద్ధిని దీనికి ప్రతీకగా మనవారు చూపించారు. అలాంటి పూర్వ ప్రాథమిక శిక్షణ వ్యవస్థను ప్రభుత్వం డెబ్బయి ఏళ్లుగా ధ్వంసం చేసింది. దాంతో మురికివాడల్లో, కూలీనాలీ చేసుకొనే పేదవారికి కుటుంబాల్లో పెద్ద విధ్వంసం జరిగిపోయింది. గుణాత్మక విలువలను విద్యార్థులకు పునాదిలో అందించాల్సిన సమయం దాటి పోయింది. ధనవంతుల పిల్లలు కాన్వెంట్లలో యూజీలో, కేజీలు చదువుతుంటే పేద పిల్లలు తమ కర్మకు వదిలివేయబడుతున్నారు. నూతన విద్యావిధానం- – 2020 ద్వారా 'పునాది దిశ' పేరుతో గొప్ప మార్పుకు అవకాశం ఉంది. పాఠశాల విద్యలో పాఠ్య- సహపాఠ్య, వృత్తివిద్య-సాధారణ విద్య అనేవి విడిగా కాకుండా జంటగా అధ్యయనం చేసేందుకు సరికొత్త అవకాశాలు వచ్చాయి. విజ్ఞాన శాస్త్రం, కళలు ఉన్నతవిద్యతో కలిసి నడిచే సంగమాలు. 'పనీ-పాట' అనే జంట పదాల్లాగా విజ్ఞానం-పనిగా, వృత్తిగా జీవితానికి స్వావలంబన కల్పిస్తే 'కళ' జీవితాన్ని నేర్పిస్తుంది. గ్లోబలైజేషన్ తర్వాత కళను వినోదంగా మార్చేసి మనిషిని యాంత్రికంగా తయారుచేస్తున్న విద్యావిధానంపై కొత్త వెలుగులు ప్రసరించనున్నాయి. ఒక వ్యక్తి సైన్సు విద్యార్థిగా ప్లస్ టు లో ప్రవేశిస్తే అతని గమ్యం అదే అవుతుంది. అతను ఒక 'ఏకమార్గం'లో పయనించేవాడిగా మారతాడు. అతనికి ఈ దేశంలో కళలు, ప్రజాస్వామ్య విధానం, చరిత్రలో జ్ఞానం శూన్యం. అలాగే ఆర్ట్స్​లో చేరిన వారికి ఏ 'పరిశోధనా జ్ఞానం' లేకుండా దేశ విజ్ఞానంపై అవగాహన లేకుండా ‘అధ్యయనం -అనుశీలనం' సాగిస్తూ దేశీయ శాస్త్రాలను, సాంకేతికతను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుతున్నాడు. ఇప్పుడు నూతన విద్యావిధానం ద్వారా అటువంటి లోటుపాట్లను సరిదిద్ది, 'మనిషి సమగ్ర స్వరూప నిర్మాణం' జరగబోతున్నది.

భవిష్య భారత్​కు ‘టానిక్​’ వంటిది

ఈ సరిక్రొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న మన యువతకు ఉపాధి, దేశంపట్ల గౌరవం, వసతులు కల్పించి దిశానిర్దేశం చేయాల్సిన మనం వాళ్ళ వ్యక్తిత్వాన్ని, చదువును భ్రూణహత్య చేస్తున్నాం. జాతీయ విద్యావిధానం 'సంజీవని' కాకపోవచ్చు కానీ 'టానిక్' అని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ ముందడుగును 'సర్వేసర్వత్రా' ఈ దేశాన్ని వ్యతిరేకించే విచ్ఛిన్నకర శక్తులు విమర్శించటం ఎప్పుడో మొదలుపెట్టాయి. విజ్ఞులైనవారు ఈ విధానాన్ని 'అధ్యయనం' చేసి ఆచరణకు సూచనలు, మార్పులు చేయకపోతే ఇదో 'నర్మదా బచావో అందోళన' లాగ సాగుతూ, కూడంకుళం ప్రాజెక్టు లాగ అడ్డంకులు ఎదుర్కొంటూ తరాల జీవితాలు ధ్వంసం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దేశ పౌరులారా! తస్మాత్ జాగ్రత్త!

దేశ మూల స్తంభాలు విద్యార్థులే

ఇప్పటివరకు  దేశంలో మెకాలే మానసపుత్రులు 'మార్క్స్ ప్రొడక్షన్' చేశారు. దానితోపాటు 'భారతీయత'ను చంపేశారు. అందువల్ల మన భాషలపట్ల మనకు గౌరవం లేకుండాపోయింది. భారతీయ భాషలను ఆంగ్లభూతం మింగేసింది. ఇక్కడి 'మూలతత్వం' తెలిపే అన్ని సిద్ధాంతాలు ధ్వంసం అయిపోయాయి. మన విద్యార్థుల్లో చదవడం, రాయడం, కనీస గణిత ప్రక్రియల్లో అవగాహన లేనివారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ వ్యవస్థ ఎంత ఘోరంగా మన విద్యావ్యవస్థను కబ్జా చేసిందో చూస్తున్నాం. ధనవంతుల పిల్లలు 'స్టేటస్' కోసం ఈ వ్యవస్థలో చదువుతుంటే ఇప్పటికీ టాయ్​లెట్స్ కూడా లేని నిత్య నరక కూపాల్లాంటి పాఠశాలల్లో, హాస్టళ్లలో పేదల పిల్లలు మగ్గుతున్నారు. 'విద్యలో సంస్కరణలు' అనగానే ఉపాధ్యాయులను దోషులుగా చూపించే వ్యవస్థలో కొనసాగుతున్నాం. బ్రిటిషుకాలం నాటి 'శిక్షణ'తో ఉపాధ్యాయులను బోధనేతర వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. జాతికి మూల స్తంభాల్లాంటి విద్యార్థులను తయారుచేసుకోవాల్సిన పాఠశాలలు 'నిరుద్యోగుల గుంపును' సృష్టిస్తున్నది. ఈ విద్యావిధానంలోని నైపుణ్యాలు విద్యార్థులను సరిక్రొత్త నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

- డా.పి.భాస్కర యోగి, పొలిటికల్​ & సోషల్​ ఎనలిస్ట్​