విద్యుత్ అమరవీరులకు జోహార్లు

విద్యుత్ అమరవీరులకు జోహార్లు
  • అమరవీరుల స్తూపానికి వామపక్ష లీడర్ల నివాళి

బషీర్ బాగ్, వెలుగు: 2000 ఆగస్టు 28న విద్యుత్ చార్జీలు పెంపు వ్యతిరేక ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల 24 వర్ధంతి సందర్భంగా వామపక్ష నేతలు బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని అమర వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఆనాటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు.

రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ ను ప్రభుత్వరంగంలోనే ఉత్పత్తి చేసుకునేందుకు వనరులున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజలంతా కలిసి పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్)  రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చెప్పారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఝాన్సీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలను నిర్మించాలని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు అనిల్,  ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.