
- బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 18, 19న నిరసనలు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌పై లెఫ్ట్ పార్టీలు జంగ్ సైరన్ మోగించాయి. ఆల్ఇండియా లెఫ్ట్ పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 18,19వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చాయి. కేంద్ర బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి సంపన్నులకు రాయితీలు పెంచిందని, సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసిందని విమర్శించాయి.
ఈ బడ్జెట్‌కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రూపొందించి, వీటికి మద్దతుగా ప్రజలను సమీకరించాలని నిర్ణయించాయి. దేశంలో 200 మంది బిలియనీర్లపై 4శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ పన్ను పెంచాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలని, బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ ఉపసంహరించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50శాతం కేటాయింపులు పెంచాలని, పట్టణాలకు వర్తింపజేయాలని కోరాయి. ఆరోగ్య రంగానికి, విద్యారంగానికి జీడీపీలో 3శాతం చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశాయి. కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.